పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న షహజాద్ భట్టీ నెట్వర్క్(ఎస్బీఎన్)ను చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిషేధిత ఉగ్రవాద సంస్థగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు. సరిహద్దుల గుండా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు ఈ నెట్వర్క్ పాల్పడుతున్నట్లు కేంద్రం పేర్కొంది.
యువతను, నేరస్థులను ఉగ్రవాద కార్యకలాపాల వైపు ప్రేరేపించడంతో పాటు భారత ప్రజాస్వామ్య వ్యవస్థ, మత సామరస్యాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషపూరిత డిజిటల్ కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఆన్లైన్ వేదికలను ఉపయోగించుకుని యువతను ప్రభావితం చేయడం, ఉగ్రవాద కార్యకలాపాలకు అవసరమైన మద్దతును సమకూర్చడం వంటి చర్యలకు నెట్వర్క్ పాల్పడుతున్నట్లు పేర్కొంది.
ప్రభుత్వ వివరాల ప్రకారం ఎస్బీఎన్ పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూప్‌గా గుర్తించబడింది. భారత్‌లో జరిగిన పలు బాంబు దాడులు, హత్యల వెనుక ఈ నెట్వర్క్ ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు సమాచారం. పోలీసు, రక్షణ సంస్థలు, మతపరమైన ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని రెక్కీ నిర్వహించేందుకు స్థానిక వ్యక్తులను ఉపయోగించినట్లు అధికారులు వెల్లడించారు.
గూఢచర్య కార్యకలాపాల కోసం సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి స్థానిక మధ్యవర్తులకు డబ్బులు చెల్లించినట్లు కూడా ప్రభుత్వ వివరాల్లో పేర్కొన్నారు. నెట్‌వర్క్‌కు సంబంధించిన కార్యకలాపాలపై దిల్లీ, పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, ఉత్తరాఖండ్ సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదైనట్లు సమాచారం. ఈ కేసుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అంశాలపై దర్యాప్తు కొనసాగినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన షహజాద్ భట్టీ తొలుత దోపిడీలతో నేర ప్రపంచంలోకి ప్రవేశించినట్లు ప్రభుత్వ వివరాల్లో పేర్కొన్నారు. అనంతరం పాకిస్థాన్ నుంచి యూఏఈకి వెళ్లినట్లు సమాచారం. అక్కడి నుంచి తన కార్యకలాపాలను విస్తరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించినట్లు తెలుస్తోంది. భారత్‌లోని స్థానిక వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకుని నెట్వర్క్ కార్యకలాపాలను కొనసాగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
భారత్ నిషేధించిన ఉగ్రవాద సంస్థల జాబితాలో ఎస్బీఎన్ 46వ సంస్థగా చేరింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద నిషేధం అమల్లోకి రావడంతో సంస్థ కార్యకలాపాలు, దాని ఆర్థిక వ్యవహారాలు, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలకు మరింత అవకాశం ఏర్పడుతుంది. నెట్‌వర్క్‌కు నిధులు, మద్దతు, మానవ వనరులు సమకూర్చే మార్గాలను అడ్డుకోవడంతో పాటు దేశ భద్రతకు ముప్పుగా భావిస్తున్న కార్యకలాపాలను నియంత్రించేందుకు కేంద్ర సంస్థలు తదుపరి చర్యలు చేపట్టనున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news