తిరుపతిలో ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తితిదే భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. గరుడ సేవ రోజున సుమారు మూడున్నర లక్షల మంది భక్తులు తరలివస్తారని అంచనా వేస్తున్న నేపథ్యంలో రద్దీ నియంత్రణ, అత్యవసర సమయాల్లో సమాచార మార్పిడి, భక్తుల భద్రత కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించనుంది.
గతంలో భారీ రద్దీ సమయంలో సెల్‌ఫోన్ నెట్‌వర్క్‌లు స్తంభించడం, ఒకేసారి వందలాది వాకీటాకీలు ఉపయోగించడంతో ఫ్రీక్వెన్సీలు కలిసిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యేవి. ఈ సమస్యను అధిగమించేందుకు తితిదే జియో సంస్థ సహకారంతో ప్రత్యేక నెట్‌వర్క్‌ను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకొస్తోంది. నెట్‌వర్క్‌లోనే ప్రత్యేక నెట్వర్క్ అనే సాంకేతిక విధానంతో పనిచేసే 30 అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను సిద్ధం చేశారు.
ఈ పరికరాలు సాధారణ ఫోన్లు, వాకీటాకీలు పనిచేయని పరిస్థితుల్లోనూ కమాండ్ కంట్రోల్ కేంద్రంతో అనుసంధానమై పనిచేసేలా ఏర్పాట్లు చేశారు. లేపాక్షి కేంద్రం, వరాహస్వామి అతిథిగృహం, నాదనీరాజనం, కమాండ్ కంట్రోల్ రూమ్ సహా 11 కీలక ఉప నియంత్రణ కేంద్రాల్లో విధులు నిర్వర్తించే ఉన్నతాధికారులకు వీటిని అందించనున్నారు.
బ్రహ్మోత్సవాల సమయంలో గ్యాలరీల నుంచి భక్తులు బయటకు వచ్చే సమయంలో తోపులాటలు జరగకుండా ప్రత్యేక నిష్క్రమణ ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఏ మాడవీధిలో ఉన్న భక్తులు అదే మార్గం ద్వారా బయటకు వెళ్లేలా దిశల వారీగా ఏర్పాట్లు చేశారు. దక్షిణ మాడవీధి భక్తుల కోసం ఎస్-3 గేట్ వద్ద ప్రత్యేక ర్యాంప్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో తిరుపతి లేదా తిరుమల బస్టాండ్‌కు వెళ్లే సౌకర్యం కల్పించనున్నారు.
భక్తుల రద్దీని కచ్చితంగా అంచనా వేయడానికి తొలిసారిగా కృత్రిమ మేధస్సు, సాఫ్ట్వేర్ ఆధారిత భక్తుల లెక్కింపు కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం దాదాపు 200 కెమెరాలను ఏర్పాటు చేశారు. గ్యాలరీలను చిన్న విభాగాలుగా విభజించి, ప్రతి ప్రాంతంలో ఎంతమంది భక్తులు ఉన్నారన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు గుర్తించేలా సాంకేతిక వ్యవస్థను రూపొందించారు. గ్యాలరీ నిండిపోతే వెంటనే భక్తులను ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది.
భద్రతలో భాగంగా అలిపిరి టోల్గేట్, నడకమార్గాలు, శ్రీవారి మెట్టు ప్రాంతాల్లో ముఖ గుర్తింపు, వాహన నంబర్ గుర్తింపు కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగతనాలు, అనుమానాస్పద కదలికలను అడ్డుకునేందుకు 40 విజిలెన్స్ బృందాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రత్యేక నేర పరిశీలన బృందాలను రప్పించారు. విజిలెన్స్, పోలీసు సిబ్బంది కలిపి మొత్తం 5,300 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తిరుమలలో కేవలం 4,600 వాహనాలకు మాత్రమే పార్కింగ్ సౌకర్యం ఉండటంతో ఆ పరిమితి దాటితే తిరుపతిలోని ఏడు ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం, వదంతులు వ్యాపించకుండా ప్రత్యేక వాస్తవ నిర్ధారణ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు.
భక్తులు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించినా, ఏదైనా ఇబ్బంది ఎదురైనా వెంటనే 0877-2263828, 98668 98630 నంబర్లకు సమాచారం అందించవచ్చు. తితిదే చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ మురళీకృష్ణ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈసారి బ్రహ్మోత్సవాల భద్రతలో సాంకేతికతకు పెద్దపీట వేస్తూ రద్దీని ముందుగానే అంచనా వేసి నియంత్రించే విధానాన్ని అమలు చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news