ప్రపంచవ్యాప్తంగా మెమొరీ చిప్‌ల కొరత, తయారీ వ్యయాల పెరుగుదల కారణంగా ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ రంగం ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే పలు ప్రముఖ టెక్నాలజీ సంస్థలు తమ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ధరలను పెంచగా, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థ టీఎస్ఎంసీ కూడా చిప్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
వచ్చే ఏడాది నుంచి టీఎస్ఎంసీ తయారు చేసే చిప్‌ల ధరలను సుమారు 10 శాతం వరకు పెంచే అవకాశముందని సమాచారం. ముఖ్యంగా 6 నానోమీటర్ల కంటే తక్కువ సాంకేతికత కలిగిన చిప్‌లతో పాటు 28 నానోమీటర్, 16 నానోమీటర్, 12 నానోమీటర్ చిప్‌ల ధరలూ పెరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ చిప్‌లను ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రముఖ సాంకేతిక సంస్థలు తమ స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కృత్రిమ మేధస్సు ఆధారిత పరికరాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీలో విస్తృతంగా వినియోగిస్తున్నాయి. దీంతో తయారీ వ్యయం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇప్పటికే యాపిల్, శాంసంగ్ వంటి పలు అంతర్జాతీయ కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలను పెంచిన నేపథ్యంలో టీఎస్ఎంసీ నిర్ణయం వినియోగదారులపై మరింత భారం మోపే అవకాశముంది. చిప్ ధరల పెరుగుదల ప్రభావంతో వచ్చే ఏడాది స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఏఐ ఆధారిత పరికరాలు సహా అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు మరింత పెరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో కొత్త పరికరాలు కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news