భారతదేశంలో పిల్లల ఆరోగ్యాన్ని వేధిస్తున్న కొత్త సంక్షోభం వెలుగులోకి వచ్చింది. ఒకవైపు పౌష్టికాహార లోపంతో బరువు తక్కువగా ఉన్న పిల్లలు పెరుగుతుండగా, మరోవైపు అదే వయసు పిల్లల్లో ఊబకాయం వేగంగా విస్తరిస్తోంది. ఈ పరిస్థితిని వైద్య నిపుణులు "డబుల్ బర్డెన్ ఆఫ్ మాల్న్యూట్రిషన్"గా పేర్కొంటున్నారు. హైదరాబాద్, వేలూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన సుదీర్ఘ అధ్యయనంలో ఐదేళ్ల తర్వాత పిల్లల్లో పోషకాహార అసమానతలు తీవ్రరూపం దాల్చుతున్నట్లు తేలింది. తొమ్మిదేళ్ల వయసు నాటికి 21.6 శాతం మంది పిల్లలు బరువు తక్కువ సమస్యతో బాధపడుతుండగా, 14.6 శాతం మంది ఊబకాయంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
2010 నుంచి 2021 మధ్య జన్మించిన 251 మంది పిల్లల ఎదుగుదలను తొమ్మిదేళ్ల వయసు వరకు పరిశీలించిన ఈ పరిశోధనలో అనేక కీలక అంశాలు బయటపడ్డాయి. పిల్లల ఎత్తు, బరువు, బాడీ మాస్ ఇండెక్స్‌తో పాటు వారి తల్లుల ఆరోగ్య పరిస్థితులను కూడా విశ్లేషించారు. ఈ అధ్యయనం ప్రకారం తల్లుల ఆరోగ్యం పిల్లల భవిష్యత్తు శారీరక ఎదుగుదలపై నేరుగా ప్రభావం చూపుతోంది. తక్కువ బీఎంఐ ఉన్న తల్లులకు పుట్టిన పిల్లల్లో పౌష్టికాహార లోపం ప్రమాదం ఎక్కువగా కనిపించింది. గర్భధారణ సమయంలో తగిన పోషకాహారం అందకపోవడం వల్ల పిల్లల జీవక్రియలు ప్రభావితమై, బాల్యంలో సన్నబారే అవకాశం పెరుగుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఐదేళ్ల వయసు వరకు చాలా మంది పిల్లలు సాధారణ బరువుకు చేరుకున్నప్పటికీ, ఏడేళ్ల తర్వాత పరిస్థితి మారుతోంది. రెండేళ్ల వయసులో ఎదుగుదల లోపంతో బాధపడిన పిల్లల్లో అధిక శాతం మంది ఐదేళ్ల నాటికి కోలుకున్నా, ఏడేళ్ల వయసు తర్వాత మళ్లీ రెండు రకాల సమస్యలు బయటపడుతున్నాయి. బరువు తక్కువగా ఉండే పిల్లల సంఖ్య పెరగడంతో పాటు ఊబకాయం కూడా వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా 2,500 గ్రాముల కంటే తక్కువ బరువుతో జన్మించిన పిల్లల్లో తొమ్మిదేళ్ల వయసు వచ్చినా సన్నగా ఉండే సమస్య ఎక్కువగా కనిపించింది.
ఇక సాధారణ బరువుతో జన్మించిన పిల్లల్లో మారుతున్న జీవనశైలి, జంక్ ఫుడ్ అలవాట్లు, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల ఊబకాయం పెరుగుతోంది. పాఠశాలల పరిసరాల్లో లభించే ప్యాకేజ్డ్ ఆహారాలు, ఎక్కువసేపు మొబైల్ ఫోన్లు, టెలివిజన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని అధ్యయనం స్పష్టం చేసింది. శారీరక వ్యాయామం తగ్గిపోవడం, బయట ఆటలు ఆడే అలవాటు తగ్గడం కూడా ప్రధాన కారణాలుగా గుర్తించారు.
భారతదేశంలో ప్రస్తుతం అమలవుతున్న అనేక పౌష్టికాహార పథకాలు ఐదేళ్లలోపు పిల్లలపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే తాజా అధ్యయనం ప్రకారం అసలు సవాళ్లు ఐదేళ్ల తర్వాత ప్రారంభమవుతున్నాయి. అందువల్ల పౌష్టికాహార మద్దతు, ఆరోగ్య పర్యవేక్షణను పాఠశాల వయసు పిల్లలకు కూడా విస్తరించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. గర్భధారణకు ముందే మహిళలకు సరైన పోషకాహారం అందించడం, తల్లుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, పాఠశాలల్లో ఆరోగ్యకరమైన ఆహార విధానాలను అమలు చేయడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చని అధ్యయనం పేర్కొంది.
ప్రపంచ స్థాయిలో కూడా ఇదే ధోరణి కనిపిస్తోంది. తాజా అంతర్జాతీయ గణాంకాల ప్రకారం చరిత్రలో తొలిసారిగా పిల్లల్లో ఊబకాయం రేటు, తక్కువ బరువు సమస్యను అధిగమించింది. ఇది భవిష్యత్తులో మరింత పెద్ద ఆరోగ్య సంక్షోభానికి సంకేతంగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల కోసం సమగ్ర పోషకాహార విధానాలు, ఆరోగ్యకర జీవనశైలి అలవాట్లు అత్యవసరమని ఈ అధ్యయనం స్పష్టంగా తెలియజేస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news