నీట్ పరీక్ష ఒత్తిడి మరో విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది. తమిళనాడులోని హోసూర్‌కు చెందిన సి. వెట్రియనంతం (20) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. గత మూడు సంవత్సరాలుగా నీట్ పరీక్ష కోసం సిద్ధమవుతున్న అతడు, ఇటీవల పరీక్షకు సంబంధించిన పరిణామాలతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్ష రద్దు కావడం, మళ్లీ పరీక్షలు, ఫలితాలపై అనిశ్చితి నెలకొనడం వల్ల వెట్రియనంతం తీవ్ర ఆందోళనకు లోనైనట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘటనాస్థలంలో లభించిన సూసైడ్ నోట్లో వెట్రియనంతం తన మనోవేదనను వ్యక్తం చేశాడు. “గత నెల రోజులుగా సరిగా నిద్రపోలేకపోయాను. పరీక్షలో విఫలమవుతాననే భయం వెంటాడుతోంది. ఈ నిర్ణయం తీసుకోవడం తప్ప మరో మార్గం కనిపించలేదు. అమ్మ, నాన్న, అన్న నన్ను క్షమించండి” అని పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటన మరోసారి పోటీ పరీక్షల ఒత్తిడి, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై చర్చకు దారితీసింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం మానసికంగా అండగా నిలవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news