విశాఖపట్నానికి చెందిన టెకీ రాధా గాయత్రి మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆమె భర్త శ్రీచరణ్‌పై ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103(1) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.
గత ఏడాది వివాహం చేసుకున్న రాధా గాయత్రి, శ్రీచరణ్ ఇటీవల ఉత్తరాఖండ్‌లో విహారయాత్రకు వెళ్లారు. రిషికేశ్, డెహ్రాడూన్ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం ముస్సోరిలోని ఓ హోమ్‌స్టేలో బస చేశారు. అక్కడే రాధా గాయత్రి అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన విషయం వెలుగులోకి రావడంతో ఈ కేసు సంచలనంగా మారింది.
తన కుమార్తె మరణంపై పలు అనుమానాలు ఉన్నాయని రాధా గాయత్రి తండ్రి సుధాకర్ ఆరోపిస్తున్నారు. వివాహానంతరం శ్రీచరణ్ వేధింపులకు గురిచేయడంతో పాటు, అతని ప్రవర్తనపై కూడా అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసును హత్య కోణంలో నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మరోవైపు, రాధా గాయత్రిని తాను ఎంతో ప్రేమించానని, ఆమె మరణంతో తీవ్ర విషాదంలో ఉన్నానని శ్రీచరణ్ చెబుతున్నారు. పోస్టుమార్టం నివేదిక వెలువడిన తర్వాతే అసలు కారణాలు బయటపడతాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. ప్రస్తుతం ముస్సోరి పోలీసులు హోమ్‌స్టే సిబ్బంది వాంగ్మూలాలు, సీసీటీవీ దృశ్యాలు, ఫోరెన్సిక్ ఆధారాలను పరిశీలిస్తూ కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఈ కేసు ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య తీవ్ర వివాదానికి దారితీయగా, పోస్టుమార్టం నివేదికతో పాటు పోలీసుల దర్యాప్తు ఫలితాలపై అందరి దృష్టి నిలిచింది. రాధా గాయత్రి మృతి సహజమా, ప్రమాదవశాత్తూ జరిగిందా లేదా హత్యా అనే అంశంపై దర్యాప్తు అనంతరం స్పష్టత రానుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news