యురేనియం శుద్ధి కార్యక్రమంపై ఇరాన్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. అమెరికాతో అణు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. యురేనియం శుద్ధి చేయడం తమ సార్వభౌమ హక్కు అని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ హక్కును వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.
అమెరికా తరచుగా ఇరాన్ అణు కార్యక్రమంపై ఆందోళనలు వ్యక్తం చేస్తోందని పేర్కొన్న పెజెష్కియాన్, అణుబాంబు తయారీ తమ లక్ష్యం కాదని మరోసారి స్పష్టం చేశారు. అయితే శాంతియుత అవసరాల కోసం అణుశక్తిని వినియోగించుకోవడం, యురేనియం శుద్ధి ప్రక్రియను కొనసాగించడం అంతర్జాతీయ చట్టాల ప్రకారం తమకు ఉన్న హక్కు అని అన్నారు.
“అణ్వాయుధాలు తయారు చేయాలనే ఉద్దేశం మాకు లేదు. కానీ యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపాలని ఎవరైనా ఒత్తిడి తెస్తే అంగీకరించం. ఇది మా హక్కు. దీన్ని వదులుకునే ప్రశ్నే లేదు” అని ఇరాన్ అధ్యక్షుడు స్పష్టం చేశారు. ఈ విషయంలో అమెరికా సహా ఇతర దేశాలు వాస్తవాలను అంగీకరించాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో స్విట్జర్లాండ్ వేదికగా కీలక దౌత్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల ప్రతినిధులు అణు కార్యక్రమం, ఆంక్షలు, ప్రాంతీయ భద్రత తదితర అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశాలు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించడంలో ఎంతవరకు ఫలితాన్నిస్తాయన్న దానిపై అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా, పాశ్చాత్య దేశాలు ఎన్నో సంవత్సరాలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పటికీ, తమ కార్యక్రమం పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని టెహ్రాన్ వాదిస్తోంది. ప్రస్తుత చర్చల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. యురేనియం శుద్ధి అంశంపై రాజీ పడబోమన్న ఇరాన్ సంకేతాలతో భవిష్యత్ చర్చల దిశపై ఉత్కంఠ నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news