విజయనగరం జిల్లా కొత్తవలస మండలం తుమ్మకాపల్లి పంచాయతీ పరిధిలోని విశాఖ–అరకు ప్రధాన రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటనకు ముందు జరిగిన దొంగతనం ఘటనతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, విజయనగరం పట్టణానికి చెందిన శంకర్ సాయి అనకాపల్లి నుండి పనులు ముగించుకుని కొత్తవలస చేరుకుని అక్కడి నుంచి విజయనగరం వెళ్లేందుకు జంక్షన్ వద్ద వేచి ఉన్నాడు. ఈ సమయంలో శ్రీకాకుళం మరియు విశాఖ జిల్లాలకు చెందిన ఇద్దరు యువకులు అతని వద్దకు వచ్చి డబ్బులు అడిగారు. అనంతరం మాటల వివాదం పెరిగి అతనిపై దాడి చేసి నగదు, సుమారు పావు తులం బంగారం లాక్కున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
దాడి అనంతరం అక్కడి నుంచి పరారైన ఇద్దరు యువకులు ఎస్.కోట వైపు వెళ్తుండగా, తుమ్మకాపల్లి వద్ద ఫైర్ స్టేషన్ సమీపంలో ఎదురుగా వచ్చిన ఆటో వారిని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో 19 ఏళ్ల కొంగాపు రోహిత్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గొంప కుమార్ స్వామి తీవ్రంగా గాయపడ్డాడు.
మృతుడిపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో ఏడు దొంగతనం కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన యువకుడిపై పూర్వపు కేసులు లేవని వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Fetching videos...
Fetching latest news...
No trending news