జనగణన దేశ అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలకు పునాది వంటిదని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడ రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో పురపాలక సంఘ పరిధిలో జనగణన ప్రక్రియను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్ సింహాద్రి మనోహర్‌తో కలిసి ప్రభుత్వ పోర్టల్‌లో స్వయంగా తన కుటుంబ వివరాలు, గృహ సమాచారం, వసతుల వివరాలను నమోదు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, జనగణనలో ప్రతి పౌరుడు తప్పకుండా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఇది కేవలం గణాంకాల సేకరణ మాత్రమే కాదని, భవిష్యత్తులో ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి ప్రణాళికలు, మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత కీలకమైన ఆధారంగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. రోడ్లు, స్కూళ్లు, ఆసుపత్రులు, తాగునీటి సదుపాయాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల నుంచి సేకరించే నిజమైన సమాచారంపై ఆధారపడి ఉంటాయని వివరించారు.
ఈ జనగణన ప్రక్రియను ప్రభుత్వం రెండు దశల్లో నిర్వహిస్తోందని కమిషనర్ సింహాద్రి మనోహర్ తెలిపారు. మొదటి దశలో ఈ నెల 16 నుండి 30 వరకు ఇంటి వివరాలు, వసతుల స్వీయ గణన జరుగుతుందని చెప్పారు. రెండో దశలో మే 1 నుండి 30 వరకు ఎన్యూమరేటర్లు ప్రత్యక్షంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారని తెలిపారు. ప్రజలు సరైన సమాచారం అందించి ఈ ప్రక్రియకు సహకరించాలని ఆయన కోరారు.
ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ, తాను కూడా తన కుటుంబ వివరాలను స్వీయ గణనలో నమోదు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఎటువంటి అపోహలకు లోనుకాకుండా జనగణనలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది రాష్ట్ర, దేశ అభివృద్ధికి దారితీసే ముఖ్యమైన ప్రక్రియ అని పేర్కొన్నారు. మున్సిపల్ సిబ్బంది మరియు ఇతర అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news