తిరుపతిలోని పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద గజరాజు బీభత్సం సృష్టించింది. ఆలయ వాహన మండపం సమీపంలో మావటి చంద్రయ్యపై ఏనుగు ఒక్కసారిగా దాడి చేసింది. ప్రతిరోజూ ఊంజల్ సేవకు వచ్చే ఏనుగు మావటిపై దాడి చేయడంతో అక్కడ ఉన్న భక్తులు, ఆలయ సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఏనుగు దాడిలో చంద్రయ్యకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.
ఘటన జరిగిన వెంటనే ఆలయ సిబ్బంది అప్రమత్తమై మావటి చంద్రయ్యను ఏనుగు నుంచి దూరంగా తీసుకెళ్లారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గజరాజు దాడి ఘటనతో పద్మావతి అమ్మవారి ఆలయ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భక్తుల భద్రత దృష్ట్యా ఆలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ప్రతిరోజూ ఊంజల్ సేవకు వచ్చే ఏనుగు మావటిపై అకస్మాత్తుగా దాడి చేయడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఏనుగు ప్రవర్తనలో మార్పుకు కారణమేంటనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. గజరాజును నియంత్రించేందుకు సిబ్బంది చర్యలు చేపట్టారు. ఆలయ పరిసరాల్లో ఏనుగుల సంరక్షణ, మావటిల భద్రత, భక్తుల రక్షణకు సంబంధించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించే అవకాశం ఉంది. ఘటనపై ఆలయ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news