తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఒకే రాత్రి మూడు ఆలయాల్లో చోరీ ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. రామచంద్రాపురం మండలం చల్లావారిపల్లి ముత్యాలమ్మ గుడితో పాటు తాటితోపు కండ్రిగలోని రాములవారి ఆలయం, అంకాలమ్మ ఆలయాల్లో గుర్తు తెలియని దొంగలు చోరీలకు పాల్పడినట్లు సమాచారం. వరుసగా ఆలయాల్లో జరిగిన ఈ ఘటనలతో భక్తులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
చల్లావారిపల్లి ముత్యాలమ్మ ఆలయంలో దొంగలు 8 గ్రాముల బంగారు కాసులు, సుమారు 20 వేల రూపాయల నగదును అపహరించినట్లు అధికారులు తెలిపారు. ఆలయ తాళాలు ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించిన దొంగలు నగదు, ఆభరణాలను తీసుకెళ్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఉదయం ఆలయాన్ని తెరవడానికి వచ్చిన పూజారులు చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
అదే రాత్రి తాటితోపు కండ్రిగలోని రాములవారి ఆలయం, అంకాలమ్మ ఆలయాల్లో కూడా దొంగలు హుండీలను పగులగొట్టి నగదు అపహరించినట్లు తెలుస్తోంది. వరుసగా మూడు ఆలయాల్లో చోరీలు జరగడంతో ఇది పథకం ప్రకారమే జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆలయాల్లో సీసీ కెమెరాల వివరాలు, పరిసర ప్రాంతాల ఆధారాలను సేకరిస్తున్నారు.
ఘటనలపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. దొంగలు ఎలా ప్రవేశించారు, ఎంత మొత్తంలో నగదు, ఆభరణాలు అపహరించబడ్డాయి అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తూ దర్యాప్తును వేగవంతం చేశారు.
ఒకే రాత్రి మూడు ఆలయాల్లో చోరీలు జరగడం భద్రతా లోపాలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆలయాల వద్ద భద్రతా చర్యలు పెంచాలని, రాత్రి గస్తీ వ్యవస్థను బలోపేతం చేయాలని భక్తులు కోరుతున్నారు. పోలీసులు త్వరలోనే దొంగలను గుర్తిస్తామని, కేసును చేధించేందుకు ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news