తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం వైభవంగా ముగిశాయి. తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాలకు ముగింపుగా చివరి రోజున ఉదయం శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు పవిత్ర పుష్కరిణి జలాల్లో స్నానం చేయించగా, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని పుణ్యస్నానాలు ఆచరించారు.
చక్రస్నానానికి ముందు తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. అనంతరం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల మధ్య శ్రీ భూవరాహస్వామివారి ఆలయ ముఖమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు.
విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, ముఖప్రక్షాళన, ధూపదీప నైవేద్యం, ఛత్రచామరాది రాజోపచారాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాలు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, గంధంతో శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణల ద్వారా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ వేదపారాయణదారులు ఉపనిషత్తు, దశశాంతి, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర వేద మంత్రాలను పారాయణం చేశారు.
అభిషేకం అనంతరం పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి దివ్య ప్రబంధ పాశురాలను పఠించారు. తొమ్మిదిరోజుల బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన సమస్త సేవలు సఫలమై, లోకక్షేమం, భక్తుల సుఖశాంతులు కలగాలని చక్రస్నానం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. బ్రహ్మోత్సవాలు యజ్ఞస్వరూపంగా భావించబడుతుండగా, యజ్ఞాంతంలో నిర్వహించే అవభృథస్నానం ద్వారా ఉత్సవ నిర్వహణలో జరిగిన లోపదోషాలు తొలగి సంపూర్ణ ఫలితాలు చేకూరుతాయని ఆగమ సంప్రదాయం చెబుతోంది.
స్నపన తిరుమంజనం అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లను శ్రీవారి పుష్కరిణికి తీసుకువచ్చి పవిత్ర జలాల్లో స్నానం చేయించారు. సుదర్శన చక్ర స్పర్శతో పుష్కరిణి జలాలు మరింత పావనమయ్యాయని విశ్వసిస్తూ వేలాది మంది భక్తులు అదే సమయంలో పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. చక్రస్నానాన్ని దర్శించిన, నిర్వహించిన, సహకరించిన భక్తులందరికీ బ్రహ్మోత్సవ యజ్ఞఫలం లభించాలని శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవోలు డా. ఎ. శరత్, ప్రభల గోపీనాథ్, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ సీఈ మనోహరం, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్, శ్రీవారి సేవకులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news