ప్రజల ఆశీర్వాద బలమే తనను ఇంతకాలం నడిపించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో 25 ఏళ్ల పాటు నిరంతరంగా ప్రజాసేవ చేస్తానని తాను ఊహించలేదని తెలిపారు. ఇన్నేళ్లుగా తనకు ఆశీస్సులు అందించిన దేశ ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు తనకు ఎల్లప్పుడూ అండగా నిలిచారని పేర్కొన్నారు.
ప్రజాసేవ చేయడానికి భగవంతుడు తనకు శక్తిని ఇచ్చారని ప్రధాని మోదీ అన్నారు. ప్రజలు, భగవంతుడి ఆశీస్సులతో దేశానికి మరింత సేవ చేస్తానని తెలిపారు. తాను ఎప్పుడూ నిరంతరం విద్యార్థిగానే ఆలోచిస్తానని, కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని ఎప్పటికీ వమ్ము చేయబోనని, ప్రజలకు సేవ చేయడంలో ఏనాడూ వెనుదిరగనని స్పష్టం చేశారు.
తన దృష్టిలో ప్రజలే దేవుని స్వరూపమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసం, పార్టీ కార్యకర్తలు చేస్తున్న అవిశ్రాంత శ్రమే తనకు అతిపెద్ద బలమని చెప్పారు. 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని విజయంగా కాకుండా సేవగా భావిస్తున్నానని తెలిపారు. వ్యక్తిగత ఆశయం కోసం కాకుండా ఒక లక్ష్యం కోసం జీవితాన్ని గడపాలనేదే తన ఉద్దేశమని వివరించారు.
2047 నాటికి వికసిత్ భారత్ సాధించడం సాధ్యమేనని ప్రధాని మోదీ అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణంతో పాటు భారత్‌ను ప్రపంచ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాలను కూడా సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ అభివృద్ధే తన జీవిత ఆశయమని, దేశాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటానని తెలిపారు. సంకల్ప బలం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని పేర్కొన్నారు.
ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపు చూస్తోందని ప్రధాని మోదీ అన్నారు. దేశ అభివృద్ధికి ఇదే మంచి సమయమని, అన్ని రంగాల్లో నూతన ఆవిష్కరణలకు ఇదే సరైన అవకాశమని తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు వాటికి పరిష్కార మార్గాలు కూడా వెతుక్కోవచ్చని చెప్పారు. భారత్ అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, ఆ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు.
దేశ భద్రత అంశాన్ని కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఒకప్పుడు ఉగ్రవాదం దేశానికి పెనుముప్పుగా పరిణమించిందని అన్నారు. దేశ భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు భారత్ ఎలా ప్రతిఘటించగలదో ప్రపంచానికి చూపించామని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం, కార్యకర్తల కృషి, దేశ సేవ పట్ల తన నిబద్ధతతో ముందుకు సాగుతానని ప్రధాని మోదీ తెలిపారు. ભારત అభివృద్ధి, భద్రత, స్వావలంబన దిశగా మరింత వేగంగా పయనించేందుకు తన వంతు కృషి కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news