రాప్తాడు నియోజకవర్గంలోని పేరూరు డ్యామ్ అభివృద్ధి అంశం మళ్లీ రాజకీయ చర్చలకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై TNSF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి తీవ్ర స్థాయిలో స్పందిస్తూ సంచలన ఆరోపణలు, విమర్శలు చేశారు. డ్యామ్ అభివృద్ధి, రైతుల ప్రయోజనాల పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మకూడదని ఆయన పేర్కొన్నారు.
బండి మాట్లాడుతూ, పేరూరు డ్యామ్‌కు శాశ్వత సాగునీరు అందించి రైతుల జీవితాల్లో సంతోషం తీసుకురావాలన్నది మాజీ మంత్రి పరిటాల రవీంద్ర గారి కల అని గుర్తు చేశారు. ఆ ఆశయాన్ని కొనసాగిస్తూ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ గారు ప్రత్యేక చొరవతో రూ.805 కోట్ల బడ్జెట్ తీసుకొచ్చి, డ్యామ్ అభివృద్ధి పనుల్లో 50 శాతం వరకు పూర్తిచేసినట్లు తెలిపారు. రైతుల ప్రయోజనాలే ప్రధాన లక్ష్యంగా ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.
అయితే మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి డ్యామ్ పనులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని బండి ఆరోపించారు. గతంలో 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా డ్యామ్ అభివృద్ధి పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని విమర్శించారు. బడ్జెట్ పేరుతో ప్రాజెక్టులను విభజించి, కనీస పనులు కూడా ప్రారంభించలేదని ఆరోపించారు.
తోపుదుర్తి గ్రామం పేరుతో రైతుల నుంచి భూములు సేకరించి, వారికి సరైన నష్టపరిహారం ఇవ్వలేదని, రికార్డుల మార్పులు, అడంగల్ ఎంట్రీల విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయని బండి పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాల కంటే వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరించారని విమర్శించారు.
అలాగే పరిటాల కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, నియోజకవర్గ అభివృద్ధిలో పరిటాల సునీతమ్మ గారి పాత్రను ప్రజలు బాగా గుర్తించారని అన్నారు. చెరువులు, వంకలు, చెక్ డ్యాంల ద్వారా సాగునీరు అందించి రాప్తాడు ప్రాంతాన్ని పచ్చని పొలాలుగా మార్చిన ఘనత వారికి ఉందని చెప్పారు.
ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులను చూసి కొన్ని రాజకీయ వర్గాలకు నిద్ర పట్టడం లేదని బండి వ్యాఖ్యానించారు. ప్రజలు ఇప్పటికే మూడు సార్లు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంకా తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తున్నారని ఆయన విమర్శించారు.
రాప్తాడు రైతులు అభివృద్ధిని స్పష్టంగా చూస్తున్నారని, పేరూరు డ్యామ్ పనులు పూర్తయితే ప్రతి రైతుకు సాగునీరు అందుతుందని, అప్పుడు నిజం ప్రజల ముందు స్పష్టమవుతుందని ఆయన తెలిపారు. చివరగా, అభివృద్ధిపై ఆధారపడి కాకుండా తప్పుడు ప్రచారాలపై రాజకీయాలు చేయడం సరికాదని బండి హితవు పలికారు.
Fetching videos...
Fetching latest news...
No trending news