పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర గ్రామాల పారిశుద్ధ్యానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో స్వచ్ఛ ఆంధ్ర మిషన్ ద్వారా పంచాయతీలకు మంజూరైన ట్రై సైకిళ్లు, పుష్ కార్ట్లు, డస్ట్ బిన్లు పంపిణీతో పాటు ‘స్వచ్ఛ రథం’ను ప్రారంభించారు. ఈ రథం ద్వారా వ్యర్థాలను సేకరించి గృహావసర వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కల్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఐదేళ్ల పాలనలో పంచాయతీ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, గ్రామాలను మురికి కూపాలుగా మార్చారని విమర్శించారు. గతంలో ఏర్పాటు చేసిన చెత్త శుద్ధి కేంద్రాలను కూడా నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేశామని ఆయన తెలిపారు. గ్రీన్ అంబాసిడర్ల వ్యవస్థను బలోపేతం చేసి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో భాగంగా చెత్త సేకరణకు అవసరమైన వాహనాలు, పరికరాలు పెద్ద ఎత్తున అందిస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కే సత్యం, ఏఎంసీ చైర్మన్ గొట్టాపు గౌరీ, కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ జీవీ నాయుడు, వ్యవసాయ అధికారి రమణమూర్తి, డిప్యూటీ ఎంపీడీవో శర్మతో పాటు టీడీపీ కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news