పరీక్షా ఫలితాలు జీవితానికి ముగింపు కాదని, అవి కేవలం ఒక దశ మాత్రమేనని సామాజిక కార్యకర్త గాడి ఇంతియాజ్ అహ్మద్ తెలిపారు. ముఖ్యంగా పదో తరగతి, ఇంటర్ వంటి కీలక పరీక్షల ఫలితాల సమయంలో విద్యార్థులు ఆందోళనకు లోనుకాకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని ఆయన సూచించారు.
ఫలితాలు ఆశించిన విధంగా రాకపోయినా లేదా ఫెయిల్ అయినా అది జీవితానికి ముగింపు కాదని, ప్రతి అపజయం విజయానికి తొలి మెట్టు అని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి చేయకుండా, వారిని అవమానించకుండా స్నేహపూర్వకంగా ప్రోత్సహించాలని సూచించారు.
పిల్లలను ఇతరులతో పోల్చడం, తక్కువ మార్కులపై విమర్శించడం వంటివి వారి మనసుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. బదులుగా వారి భావోద్వేగాలను అర్థం చేసుకుని మద్దతు ఇవ్వాలని తెలిపారు.
సచిన్ టెండూల్కర్, అబ్దుల్ కలాం, లతా మంగేష్కర్ వంటి ప్రముఖుల జీవితాలను ఉదాహరణగా చూపుతూ, మార్కులు మాత్రమే విజయం కాదని, ప్రతిభ, కృషి, పట్టుదలే అసలు విజయానికి కారణమని వివరించారు.
సోషల్ మీడియా ప్రభావం, సమాజ ఒత్తిడితో విద్యార్థులు చిన్న సమస్యలను పెద్దగా భావిస్తున్నారని, అందుకే తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
చివరగా, “జీవితంలో ఓటమి శాశ్వతం కాదు, గెలుపు కూడా ఒక్కరోజులో రాదు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితేనే నిజమైన విజయం సాధ్యం” అని ఆయన పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news