పాలకొండ : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ అగ్నిమాపక కేంద్రంలో జాతీయ అగ్నిమాపక వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి సబ్ కలెక్టర్ శ్రీ స్వప్నిల్ పవర్ ఐఏఎస్ ముఖ్య అతిథిగా హాజరై పరేడ్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం 1944 ఏప్రిల్ 14న ముంబై విక్టోరియా ఓడరేవులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 231 మంది అగ్నిమాపక అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. అలాగే విధి నిర్వహణలో అమరులైన అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ పూలమాలలు వేసి రెండు నిమిషాల మౌనం పాటించారు.
ఈ సందర్భంగా జాతీయ అగ్నిమాపక వారోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. అగ్నిమాపక వాహనానికి పచ్చజెండా ఊపి వారోత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. విద్యార్థులు రూపొందించిన అగ్నిమాపక అంశాలపై చిత్రలేఖనాలను పరిశీలించి, వారి ప్రతిభను అభినందించారు.
అదే కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేద్కర్ గారి ఆశయాలు సమాజానికి మార్గదర్శకమని అధికారులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు, కేంద్ర సిబ్బంది, విద్యార్థులు మరియు పలువురు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news