దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ వరుస హత్యల కేసులో నిర్దోషిగా తేలిన సురేందర్ కోలీ మృతి చెందాడు. హరిద్వార్‌లోని ఓ టీ దుకాణంలో ఉరికి వేలాడుతూ కనిపించాడు. అతడి మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. కోలీ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
2006లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా నిఠారీ ప్రాంతంలో మోనిందర్సింగ్ పంఢేర్ ఇంటి వెనుక ఉన్న మురుగుకాల్వలో 16 మంది చిన్నారుల అస్థికలు బయటపడటం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేసు దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ చేపట్టింది. మోనిందర్సింగ్ పంఢేర్తో పాటు అతడి ఇంట్లో సహాయకుడిగా పనిచేసిన సురేందర్ కోలీని కూడా దర్యాప్తు అధికారులు అరెస్టు చేశారు.
ఈ వ్యవహారంలో మొత్తం 19 కేసులు 2007లో నమోదు చేశారు. అయితే తగిన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో వాటిలో మూడు కేసులను దర్యాప్తు సంస్థ మూసివేసింది. మిగిలిన కేసుల్లో సురేందర్ కోలీపై విచారణ కొనసాగింది. అనంతరం 2023 అక్టోబర్ 16న అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తగిన ఆధారాలు లేకపోవడంతో కోలీని నిర్దోషిగా ప్రకటించింది.
అప్పటికి మోనిందర్సింగ్ పంఢేర్పై మూడు కేసులు మాత్రమే మిగిలి ఉండగా, వాటిలోనూ అతడిని హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఈ కేసుల దర్యాప్తులో కేంద్ర దర్యాప్తు సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. నిందితులే నేరాలకు పాల్పడ్డారని ప్రాసిక్యూషన్ తగిన ఆధారాలతో నిరూపించలేకపోయిందని పేర్కొంది.
హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థతో పాటు మృతుల కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గత ఏడాది జులైలో వాటన్నింటినీ కొట్టివేసింది. దీంతో నిఠారీ కేసుల్లో కోలీ, పంఢేర్లపై కొనసాగిన న్యాయపరమైన ప్రక్రియకు ముగింపు ఏర్పడింది.
ఈ పరిణామాల అనంతరం కొన్ని రోజుల క్రితం సురేందర్ కోలీ హరిద్వార్‌కు వెళ్లినట్లు సమాచారం. అక్కడ ఓ టీ దుకాణంలో పనిచేస్తున్న సమయంలోనే అతడు మృతిచెందాడు. టీ దుకాణంలో ఉరికి వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. కోలీ మృతికి అసలు కారణం ఏమిటన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
Fetching videos...
Fetching latest news...
No trending news