రాష్ట్రంలో గత వైసీపీ పాలన విధ్వంసానికి నిదర్శనమైతే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వికాసం వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్తోందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. అర్బన్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
29వ విడతలో భాగంగా 26 మందికి రూ.13.93 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 23 నెలల కాలంలో ఒక్క అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోనే 565 మందికి మొత్తం రూ.5.64 కోట్ల సాయం అందించినట్లు తెలిపారు.
పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయం చేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి సహాయం అందలేదని, ఈ విషయాన్ని వైసీపీ నాయకులే చెబుతున్నారని అన్నారు.
గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసి విధ్వంసకర పాలన సాగించారని విమర్శించిన దగ్గుపాటి, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏడాదిలోపే రాష్ట్ర వ్యవస్థలు గాడిలో పడ్డాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, మెగా డీఎస్సీ, పెరిగిన పింఛన్లు వంటి నిర్ణయాలు అందుకు ఉదాహరణ అని తెలిపారు.
రాష్ట్రానికి ఇప్పటికే రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రతి రోజు కొత్త పరిశ్రమలు ప్రారంభమవుతున్నాయని, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితో ఇది సాధ్యమైందన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తలారి ఆదినారాయణ, నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి ఫిరోజ్ అహ్మద్‌తో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news