నెల్లూరు నగర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. “ప్రజల ముంగిటకే పాలన” అనే లక్ష్యంతో వెల్ఫేర్ అసోసియేషన్లతో నేరుగా సమావేశమై సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు.
45వ డివిజన్ రామ్మూర్తి నగర్లో వెల్ఫేర్ ఫెడరేషన్ కమిటీ సభ్యులతో మంత్రి కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీల్లో పౌర సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు నెల్లూరు నగరంలోని 20, గ్రామీణ పరిధిలోని 26 అసోసియేషన్లతో కలిసి మొత్తం 46 వెల్ఫేర్ సంఘాలను అభివృద్ధి భాగస్వాములుగా చేశారు.
ఈ సంఘాలకు ‘పురమిత్ర’ యాప్ ద్వారా ప్రత్యేక లాగిన్ ఐడీలు కేటాయించారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు వంటి సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ యాప్ను రూపొందించారు.
ప్రతి నెలా సంబంధిత వార్డుల ప్రతినిధులతో ఆయా ప్రాంతాల్లోనే సమావేశమై అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షిస్తానని మంత్రి నారాయణ హామీ ఇచ్చారు. కమిషనర్, అడిషనల్ కమిషనర్లు, వాటర్వర్క్స్, రోడ్లు, గ్రీన్ కార్పొరేషన్, టాక్స్ విభాగాల అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటారని తెలిపారు.
పార్కుల నిర్వహణ, మొక్కల పెంపక బాధ్యతలను వెల్ఫేర్ అసోసియేషన్లు స్వచ్ఛందంగా తీసుకోవడం అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఆదర్శవంతమైన, సుందరమైన నెల్లూరు నగరాన్ని నిర్మిస్తామని స్పష్టం చేశారు.
అంతకుముందు రామ్మూర్తి నగర్లో ఎన్టీఆర్ సుజల మినరల్ వాటర్ ప్లాంట్ను మంత్రి ప్రారంభించారు. స్థానిక మహిళలకు రూ.2కే 20 లీటర్ల శుద్ధి చేసిన తాగునీటిని అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు మామిడాల మధు, స్థానిక నాయకులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news