నెల్లూరు నగరాన్ని ఆధునికంగా, సుందరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి వారి రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు.
వేంకటేశ్వరపురంలో రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఈ-ఆటో ఛార్జింగ్ స్టేషన్ ప్రహరీ గోడకు మంత్రి శంకుస్థాపన చేశారు. నెలాఖరుకల్లా నగరంలో 200 ఈ-ఆటోలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.
అనంతరం రూ.1.40 కోట్లతో రేబాల వారి వీధిలో నిర్మిస్తున్న పార్కు, ఏసీ ఫంక్షన్ హాల్, అత్యాధునిక జిమ్ పనులను పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఓ బాలుడికి ఇచ్చిన మాట ప్రకారం ఈ పార్కును ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు.
“ప్రజల విశ్వాసమే నాకు బలం. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటా” అని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
టీడీపీ మహానాడుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రి ఖండించారు. మహానాడు నిర్వహణ పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమని, నెల్లూరులో ఇప్పటివరకు మహానాడు జరగకపోవడంతో ఈసారి ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పారు. దీనిపై ఇతర పార్టీలు వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు.
డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, రాష్ట్ర వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి, నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news