రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మరోసారి తన సేవాభావాన్ని చాటుకున్నారు. నెల్లూరులో నిర్మిస్తున్న నూతన సీతారాముల ఆలయానికి నారాయణ గ్రూప్స్ తరఫున రూ.10 లక్షల విరాళం ప్రకటించారు.
నెల్లూరు నగరంలోని 10వ డివిజన్లో రూ.1.70 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న సీతారాముల ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికగా, వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య మంత్రి శాస్త్రోక్తంగా భూమిపూజ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న మండప నిర్మాణం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆలయ నిర్మాణానికి సహకరిస్తున్న దాతలను అభినందించిన మంత్రి, ఆలయానికి స్థలం కేటాయించిన రామచంద్ర నాయుడు, మంకు వెంకటేశ్వర్లుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన వంతు సహకారంగా నారాయణ గ్రూప్స్ నుంచి రూ.10 లక్షలు అందిస్తున్నట్లు ప్రకటించారు.
“ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. సమాజంలో ధార్మిక చైతన్యం పెరగాలి” అని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నారాయణ విద్యాసంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ సంజీవ నాయుడు, సభ్యులు రంగయ్య నాయుడు, సుబ్బారావు, మాజీ జెడ్పీటీసీ విజేతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news