స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం (జలమే జీవం)లో భాగంగా సాలూరు పట్టణంలోని కేఎచ్ స్కూల్ వాడది కోనేటి గట్టు వద్ద నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహిళా సాధికారత, నీటి సంరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి మాట్లాడుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన ‘నారీశక్తి బంధన్ అభియాన్’ బిల్లు దేశ మహిళలందరికీ గర్వకారణమని అన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం మహిళా సాధికారతకు దోహదపడే ముఖ్యమైన అడుగని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణలు దేశ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నాయని ఆమె వివరించారు.
మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తే దేశ ప్రగతి మరింత వేగంగా ముందుకు సాగుతుందని మంత్రి అన్నారు. ఈ బిల్లుకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వకపోవడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా అభివృద్ధి విషయాల్లో రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు.
స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ద్వారా పరిశుభ్రతతో పాటు నీటి వనరుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంచాలని మంత్రి పిలుపునిచ్చారు. “జలమే జీవం” అనే సందేశంతో ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు.
ప్రజలు, యువత, మహిళలు కలిసి స్వచ్ఛత కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటే స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news