గత ప్రభుత్వ హయాంలో లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పినప్పుడు, దానికి సంబంధించి కేసులు నమోదు చేసి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ భూముల వ్యవహారంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్రమంగా బదిలీ అయిన భూములను ఎందుకు తిరిగి తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో 23 లక్షల ఎకరాల మేర భూ మార్పిడి జరిగిందని ముఖ్యమంత్రి చెప్పారని మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. అలా జరిగిన భూ రిజిస్ట్రేషన్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ధరణి వ్యవస్థ, ప్రస్తుతం భూ భారతి ద్వారా లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ప్రభుత్వమే చెబుతోందని అన్నారు. ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
లక్షల కోట్ల రూపాయల విలువైన భూములకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు. అటవీ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయో స్పష్టం చేయాలని కోరారు. సంబంధిత అంశాలపై ప్రభుత్వం, రాజకీయ నేతలు పరస్పరం ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు చేశారు. భూముల వ్యవహారంలో తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని పరిశీలించేందుకు న్యాయపరమైన విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
తాము లేవనెత్తుతున్న లక్షల కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వడం లేదని మహేశ్వర్రెడ్డి అన్నారు. ఈ అంశంపై న్యాయ విచారణ జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. భూముల రికార్డులు, రిజిస్ట్రేషన్లు, నిషేధిత జాబితా వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరాలను వెల్లడించాలని కోరారు.
పార్ట్ వన్ బీలో ఐదు లక్షల ఎకరాలను క్లియర్ చేశామని ప్రభుత్వం చెబుతోందని మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ఆ భూముల కోసం ప్రత్యేకంగా ఏమైనా దరఖాస్తులు తీసుకున్నారా అని ప్రశ్నించారు. ఐదు లక్షల ఎకరాలను క్లియర్ చేసేందుకు అనుసరించిన విధానాన్ని ప్రభుత్వం అందరికీ వివరిస్తే మిగిలిన 25 లక్షల ఎకరాలను కూడా విడుదల చేసే అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించారు. ఆ ప్రక్రియ వెనుక ఉన్న అంశాలను ప్రభుత్వ పెద్దలు స్పష్టం చేయాలని కోరారు.
ఇదే అంశంపై బీజేఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 22ఏ కింద భూములపై ఎలాంటి తప్పు చేయలేదని ప్రభుత్వం భావిస్తే తమ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఎందుకు వెనుకాడుతోందని ప్రశ్నించారు. శాసనసభలో ఈ అంశంపై మాట్లాడేందుకు తమకు సమయం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు. నిషేధిత జాబితాలో లక్షల మంది రైతుల భూములను చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
22ఏ కింద భూములు నిషేధిత జాబితాలో చేరి ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల తరఫున తాము పోరాడుతున్నామని పాయల్ శంకర్ తెలిపారు. బాధిత రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా నిర్వహించినట్లు చెప్పారు. భూముల వివాదాలు, నిషేధిత జాబితాలో చేర్చిన భూముల సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news