మతం మారిన దళితులకు ఎస్సీ హోదా, రిజర్వేషన్ల అమలుపై కేంద్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ కమిషన్ తన నివేదికను సిద్ధం చేసింది. దళిత క్రైస్తవులు, దళిత ముస్లింలకు ఎస్సీ హోదా కల్పించాలా వద్దా అనే కీలక అంశంపై సుదీర్ఘ అధ్యయనం అనంతరం నివేదికను రూపొందించింది. త్వరలో ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలోని ఈ కమిషన్ దాదాపు నాలుగేళ్లపాటు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం నిర్వహించింది. మతం మారిన తర్వాత కూడా దళితులు సామాజిక వివక్షను ఎదుర్కొంటున్నారా అనే అంశంపై ప్రజల అభిప్రాయాలు, సామాజిక పరిస్థితులు, చారిత్రక అంశాలను పరిశీలించింది. వివిధ వర్గాల ప్రతినిధులు, నిపుణులు, సంఘాల అభిప్రాయాలను కూడా సేకరించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న రాజ్యాంగ ఉత్తర్వుల ప్రకారం హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకు చెందిన దళితులకు మాత్రమే ఎస్సీ హోదా వర్తిస్తోంది. అయితే క్రైస్తవ, ముస్లిం మతాల్లోకి మారిన దళితులకు కూడా అదే హక్కులు కల్పించాలని అనేక దళిత సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది.
కమిషన్ నివేదిక ప్రస్తుతం పుస్తక రూపంలో ముద్రణలో ఉన్నట్లు సమాచారం. జూన్ 10తో కమిషన్ గడువు ముగిసినప్పటికీ, నివేదిక సమర్పణ కోసం కేంద్ర ప్రభుత్వం మరో పది రోజుల గడువు పొడిగించింది. దీంతో త్వరలోనే ఈ నివేదిక అధికారికంగా కేంద్రం ముందుకు వెళ్లనుంది.
ఈ నివేదికపై రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. మతం మారిన దళితులకు రిజర్వేషన్ల అంశం చాలా కాలంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉంది. కమిషన్ సిఫార్సులు, వాటిపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్లో సామాజిక, రాజకీయ పరంగా కీలక ప్రభావం చూపే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news