భూ సమస్యల పరిష్కారాన్ని లక్ష్యంగా పెట్టుకుని పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాల జారీ, మ్యుటేషన్లు, రీ-సర్వే ప్రక్రియలో ఉన్న పెండింగ్ అంశాలను గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జేసీ రెవెన్యూ మరియు సర్వే విభాగాల అధికారులతో సమావేశమయ్యారు. పనులు పారదర్శకంగా సాగాలని, ఎక్కడా ఆలస్యం జరగకుండా చూసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
రెవెన్యూ రికార్డులను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నవీకరించాలని, అడంగల్ మరియు ఎఫ్‌ఎమ్‌బి రికార్డుల్లో తప్పులు లేకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని డిప్యూటీ తహశీల్దార్లకు సూచించారు. రెవెన్యూ, సర్వే శాఖల మధ్య సమన్వయం పెంచి ప్రజలకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.
పీజీఆర్ఎస్ ద్వారా వచ్చే భూ సంబంధిత ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని తహశీల్దార్‌కు ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా త్వరితగతిన సేవలు అందించడమే లక్ష్యంగా పని చేయాలని జేసీ సూచించారు.
ఈ సమావేశంలో తహశీల్దార్, డిప్యూటీ తహశీల్దార్లు, మండల సర్వేయర్లు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news