గోకవరం మండలంలో భూగర్భ జలాలను పెంపొందించడం లక్ష్యంగా జలధార, జలహారతి పథకాల కింద విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఈ పథకాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను బలోపేతం చేయడం, చెరువుల పునరుద్ధరణ, కాలువల శుభ్రత, సాగు నీటి సమస్యల పరిష్కారం వంటి కీలక లక్ష్యాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. మొత్తం 14 గ్రామాల్లో 234 పనులను గుర్తించగా, వాటిలో 120 పనులు జలవనరుల శాఖ ద్వారా, 114 పనులు ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద చేపట్టడం జరిగింది.
ఈ పనుల్లో భాగంగా ఇప్పటికే 72 పనులకు పరిపాలనా అనుమతి లభించగా, వాటిలో 52 చెరువుల పూడికతీత పనులు, 20 ఫీడర్ మరియు ఫీల్డ్ చానల్ పనులు ఉన్నాయి. అదనంగా 34 పనులు ఫీడర్ చానల్ మరియు పంట కాలువల అభివృద్ధికి సంబంధించినవి అనుమతుల కోసం పంపబడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 25 చెరువులు, 5 కాలువల పూడికతీత పనులు కొనసాగుతున్నాయి.
వెదురుపాక గ్రామంలోని వెంకటేశ్వర ట్యాంక్, గోకవరం పెద్దమ్మ చెరువు, మెరక రాజు చెరువు వంటి ముఖ్య జలవనరులపై పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఈ పనులను ఎన్ఆర్ఈజీఎస్ ఏపీఓ పి.ఎస్. అప్పలరాజు పర్యవేక్షిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ చెరువుల పూడికతీత వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి భూగర్భ జలాలు మెరుగవుతాయని, రైతులకు సాగునీటి ఇబ్బందులు తగ్గుతాయని వివరించారు.
జలధార, జలహారతి పథకాల ముఖ్య ఉద్దేశం ఒక చెరువును మరొక చెరువుతో అనుసంధానం చేస్తూ ఫీడర్ చానల్స్, ఫీల్డ్ చానల్స్, సరఫరా కాలువలను శుభ్రం చేసి సమర్థవంతమైన నీటి ప్రవాహ వ్యవస్థను ఏర్పాటు చేయడం అని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయానికి స్థిరమైన నీటి వనరులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
అదేవిధంగా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉపాధి శ్రామికులు ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని, పని ప్రదేశాల్లో తాగునీరు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పథకాల ద్వారా గ్రామీణ అభివృద్ధి, రైతుల సంక్షేమం, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని అధికారులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news