విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 29వ తేదీ వరకు కొనసాగనున్నాయి. శాకంబరి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులకు కనకదుర్గమ్మ అమ్మవారు ప్రకృతి స్వరూపంలో దర్శనమిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పిస్తున్నారు.
శాకంబరి అలంకరణలో భాగంగా అమ్మవారి ఆలయ ప్రాంగణాన్ని రంగురంగుల కూరగాయలు, ఆకుకూరలతో అందంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి ప్రత్యేక అలంకరణను దర్శించుకుంటున్నారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అమ్మవారి అలంకరణతో పాటు భక్తులకు అందించే కదంబం ప్రసాదం తయారీ కోసం భారీగా కూరగాయలను వినియోగిస్తున్నారు. ఈ ఏడాది శాకంబరి ఉత్సవాల కోసం సుమారు 45 టన్నుల కూరగాయలు వినియోగించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ప్రకృతి ప్రసాదించిన ఆహార సంపదకు కృతజ్ఞతగా శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
శాకంబరి రూపంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సుఖసంతోషాలు, ఆరోగ్యం, సిరిసంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఉత్సవాల నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల సందడి నెలకొంది. ప్రత్యేక పూజలు, కార్యక్రమాలతో ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news