పుణె నుంచి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానానికి గాలిలో పక్షి ఢీకొనడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇండిగోకు చెందిన 6ఈ352 విమానం పుణె నుంచి హైదరాబాద్ బయలుదేరిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. విమానం గాల్లో ప్రయాణిస్తున్న సమయంలో పక్షి ఢీకొనడంతో పైలట్ అప్రమత్తమయ్యారు. పరిస్థితిని వెంటనే అంచనా వేసి విమానాన్ని హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సురక్షితంగా దించారు.
అనంతరం విమానాన్ని నిపుణులు క్షుణ్ణంగా పరిశీలించారు. తనిఖీల్లో విమానం ముందు భాగంలో సొట్ట ఏర్పడినట్లు గుర్తించారు. పక్షి ఢీకొనడం వల్లే ఈ నష్టం సంభవించినట్లు నిపుణులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు సమాచారం. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో విమానాన్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చగలిగారు. దీంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది ప్రమాదం నుంచి బయటపడ్డారు.
మరోవైపు విమానంలో తలెత్తిన సాంకేతిక కారణాల నేపథ్యంలో చండీగఢ్ సర్వీసును నిలిపివేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించిన తర్వాతే సంబంధిత విమాన సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని తెలిపారు. విమానం ముందు భాగానికి జరిగిన నష్టంపై నిపుణులు మరింతగా పరిశీలన చేస్తున్నారు. భద్రతా ప్రమాణాలను పూర్తిగా నిర్ధారించిన తర్వాతే విమానాన్ని తిరిగి సేవల్లోకి తీసుకురానున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news