భారీ వర్షాల నేపథ్యంలో వంశధార, నాగావళి నదుల్లో వరద పరిస్థితిపై హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులను అప్రమత్తం చేశారు. వరద ప్రవాహంపై ఒడిశా అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. ముంపునకు అవకాశం ఉన్న మండలాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.
వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని హోంమంత్రి అనిత సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని నిశితంగా గమనిస్తూ, అవసరమైతే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా స్థానిక యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
వంశధార, నాగావళి నదుల వరద ప్రవాహంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని పేర్కొన్నారు. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
వరద పరిస్థితుల నేపథ్యంలో స్థానిక యంత్రాంగం, ప్రభుత్వం జారీ చేసే హెచ్చరికలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలని హోంమంత్రి అనిత కోరారు. అధికారులు సూచించినప్పుడు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news