రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సూచించారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల సన్నద్ధతా సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని గురజాల జగన్ మోహన్ సూచించారు. సమయం తక్కువగా ఉన్నందున వార్డు ఇన్ఛార్జులు, కమిటీ సభ్యులు విస్తృతంగా పర్యటించి ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. ప్రజలతో నిరంతరం సంబంధాలు కొనసాగిస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
కూటమిలోని జనసేన, బీజేపీలకు కూడా స్థానాలు కేటాయించాల్సి ఉన్నందున అందరికీ అవకాశం దక్కకపోవచ్చని ఎమ్మెల్యే తెలిపారు. అవకాశం రాని వారు నిరుత్సాహపడకుండా కూటమి నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని కోరారు. పార్టీ కోసం పనిచేసే వారికి భవిష్యత్తులో తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వైసీపీ నాయకులపై విమర్శలు చేస్తూ అక్రమ ఇసుక, ఎర్రచందనం, మైనింగ్ వ్యవహారాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, తమపై వస్తున్న ప్రచారాన్ని రాజకీయంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి తరఫున సమన్వయంతో పనిచేసి లక్ష్యాన్ని సాధించాలని పిలుపునిచ్చారు.
ఇదే సమావేశంలో నగర టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వరుణ్ కుమార్ మాట్లాడుతూ అధిష్ఠానం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. కూటమి పార్టీలను కలుపుకుని స్థానిక ఎన్నికల్లో విజయం కోసం కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, చుడా చైర్పర్సన్ కఠారి హేమలత, ఇతర నాయకులు, ఇన్ఛార్జులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news