పల్నాడు జిల్లా గురజాలలో మాచర్ల ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్పై ఓ మహిళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు. మాడుగుల అడ్డరోడ్డు వద్ద బస్సు ఆపాలని మహిళ కోరగా, బస్సు కొంత ముందుకు వెళ్లి ఆగింది. దీంతో ఆగ్రహించిన మహిళ, ఆమె కుటుంబ సభ్యులు మాచర్ల నుంచి తిరిగి వస్తున్న బస్సును అడ్డరోడ్డు వద్ద అడ్డుకున్నారు. అనంతరం బైక్లను బస్సుకు అడ్డంగా పెట్టి డ్రైవర్, కండక్టర్పై దాడి చేశారు.
డ్యూటీ ముగించుకుని వెళ్తున్న డ్రైవర్, కండక్టర్పై కోడిగుడ్లు, కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దాడికి సంబంధించిన వివరాలను కండక్టర్ సోమయ్య గురజాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు. దాడికి గల కారణాలు, ఘటనలో పాల్గొన్న వారి వివరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ప్రజా రవాణాలో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులపై దాడి చేయడం సరికాదని ఆర్టీసీ కార్మిక పరిషత్ ఖండించింది. ప్రయాణికుల సమస్యలను నిబంధనల ప్రకారం పరిష్కరించాల్సి ఉండగా, ఉద్యోగులపై భౌతిక దాడులకు పాల్పడటం ఆందోళనకరమని పేర్కొంది. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కార్మిక పరిషత్ కార్యదర్శి యార్లగడ్డ రమేష్ పోలీసులను కోరారు. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం, ప్రభుత్వంపై ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉద్యోగులకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news