శృంగవరపుకోట పరిధిలోని కొత్తవలస మేజర్ గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామ సభలో గ్రామాల అభివృద్ధికి గ్రామ సభలే పునాది అని దాసరి కార్పొరేషన్ చైర్మన్ పొట్నూరు వెంకట రత్నాజీ స్పష్టం చేశారు. ఎంపీడీవో సంజీవిని రమణయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాల నిర్వహణ వంటి సమస్యలపై సభ్యులు చర్చించారు. అలాగే గ్రామంలో పెరుగుతున్న దొంగతనాలు, గంజాయి అక్రమ రవాణా, యువతలో మత్తు పదార్థాల వినియోగం వంటి కీలక అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
ఈ సమస్యలపై స్పందించిన అధికారులు, ప్రజాప్రతినిధులు వాటిని పైస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇంత ముఖ్యమైన గ్రామ సభకు పలు శాఖల అధికారులు గైర్హాజరు కావడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా వెల్ఫేర్ అసిస్టెంట్ హాజరు కాకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు తెలియకపోవడం ప్రజలను ఆందోళనకు గురి చేసింది. కార్యాలయాల్లో కూడా సిబ్బంది వ్యవహారశైలి ఎలా ఉంటుందో అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రత్నాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగలేదని పేర్కొన్నారు. గ్రామ సభలో చర్చించిన ప్రతి అంశాన్ని అధికారులు పరిశీలించి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు. గతంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల విషయంలో ప్రతి లబ్ధిదారునికి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. రాజన్న కాలనీలో డంపింగ్ యార్డ్ సమస్య ఇప్పటికే జిల్లా అధికారుల దృష్టిలో ఉందని చెప్పారు.
ఈ సమావేశంలో టిడిపి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ, వైద్య ఆరోగ్య, స్త్రీ శిశు సంక్షేమ, ఉపాధి హామీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. అయితే రెవెన్యూ, వ్యవసాయ, పోలీస్ శాఖల అధికారులు హాజరు కాకపోవడం చర్చనీయాంశమైంది.
Fetching videos...
Fetching latest news...
No trending news