ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు ఉధృతమవుతున్న వేళ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను కీలక హెచ్చరిక చేశారు. ఆందోళనలను మరింత తీవ్రతరం చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. సోమవారం జరిగిన నిరసనల్లో 164 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. పాఠశాలల్లో తరగతి గదులు కిక్కిరిసిపోవడం, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలను నిరసిస్తూ పారిస్ పరిసర ప్రాంతాల్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు ప్రస్తుతం దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించాయి. కొన్ని చోట్ల నిరసనకారులు పాఠశాలలను రోజుల తరబడి దిగ్బంధించారు. ఆందోళనల్లో బాణసంచా కాల్చడం, పోలీసులపై వాటిని విసరడం, ఆస్తుల ధ్వంసానికి పాల్పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలపై స్పందించిన లెకోర్ను.. పాఠశాలల సమీపంలో బాణసంచా, మంటలు, హింస వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని అన్నారు. విద్యార్థులు, సిబ్బంది, పోలీసుల భద్రతకు ముప్పు కలిగించడం సరైంది కాదని స్పష్టం చేశారు. మరోవైపు హైస్కూల్ విద్యార్థుల ప్రయోజనాల కోసం పనిచేసే ఓ ఫ్రెంచ్ విద్యార్థి సంఘం మాత్రం ఈ నిరసనలు తమకు ఎదురవుతున్న విద్యా పరిస్థితులకు న్యాయమైన ప్రతిస్పందనగా అభివర్ణించింది. సోమవారం జరిగిన ఘటనల్లో 12 మంది భద్రతా సిబ్బంది, 12 మంది విద్యార్థులు, ముగ్గురు పాఠశాల సిబ్బంది గాయపడ్డారని ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల మంత్రి లారెంట్ న్యూనెజ్ తెలిపారు. మొత్తం 180 పాఠశాలలు నిరసనల ప్రభావానికి గురైనట్లు వెల్లడించారు. అయితే అరెస్టైన 164 మందికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన వెల్లడించలేదు. పారిస్ చుట్టుపక్కల ఉన్న ఇల్-దె-ఫ్రాన్స్ ప్రాంతంలో గత వారం ప్రారంభమైన ఈ ఉద్యమం ఇప్పుడు ఫ్రాన్స్‌లోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. నిరసనల నేపథ్యంలో పాఠశాలల వద్ద భద్రతను పెంచడంతో పాటు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల విద్యా సమస్యలు, ఉపాధ్యాయుల కొరత వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించాలని నిరసనకారులు డిమాండ్ చేస్తుండగా, హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా చూడటం తమ ప్రధాన బాధ్యత అని అధికారులు చెబుతున్నారు
Fetching videos...
Fetching latest news...
No trending news