ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. పీఎఫ్ ఖాతా కలిగి ఉన్న ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా ఈ-నామినేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. నామినీ వివరాలు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో పీఎఫ్ డబ్బులు, బీమా ప్రయోజనాలు పొందడంలో కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగి ప్రమాదవశాత్తూ మరణించిన సందర్భంలో పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం సొమ్ముతో పాటు ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకం కింద లభించే రూ.7 లక్షల వరకు బీమా ప్రయోజనాలు నామినీకి అందించేందుకు ఈ-నామినేషన్ అత్యంత కీలకంగా మారింది.
గతంలో నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాకపోయినా, ప్రస్తుతం ఈపీఎఫ్వో అనేక ఆన్లైన్ సేవలను పొందేందుకు నామినీ వివరాల నమోదు అవసరంగా మారింది. నామినేషన్ లేకపోతే పీఎఫ్ క్లెయిమ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో పాటు కుటుంబ సభ్యులు అవసరమైన పత్రాలు సమర్పిస్తూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ముందుగానే ఈ-నామినేషన్ పూర్తి చేస్తే అలాంటి సమస్యలు ఎదురుకావు. ఉద్యోగి మరణించిన సందర్భంలో నిధుల బదిలీ ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది.
ఈ-నామినేషన్ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే అందుబాటులో ఉంది. యూనివర్సల్ అకౌంట్ నంబర్ ద్వారా ఈపీఎఫ్వో పోర్టల్లో లాగిన్ అయి నామినీ పేరు, ఆధార్ నంబర్, జనన తేదీ, సంబంధం, చిరునామా వంటి వివరాలను నమోదు చేయవచ్చు. అవసరమైతే ఒకటి కంటే ఎక్కువ మంది నామినీలను చేర్చి వారికి ఎంత శాతం వాటా ఇవ్వాలనుకుంటున్నారో కూడా పేర్కొనవచ్చు. చివరగా ఈ-సైన్ ద్వారా ప్రక్రియను పూర్తి చేయాలి.
ఉద్యోగుల కుటుంబ భద్రత దృష్ట్యా ఈ-నామినేషన్ అత్యంత ముఖ్యమైన ప్రక్రియగా నిపుణులు చెబుతున్నారు. పీఎఫ్ ఖాతాలో జమ అవుతున్న పొదుపు సొమ్ము సరైన వ్యక్తికి చేరేందుకు, భవిష్యత్తులో చట్టపరమైన లేదా పరిపాలనా సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు ప్రతి ఖాతాదారుడు వెంటనే ఈ-నామినేషన్ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం నామినేషన్ నమోదు చేయని వారు ఆలస్యం చేయకుండా ఈపీఎఫ్వో అధికారిక పోర్టల్లోకి వెళ్లి తమ వివరాలను నవీకరించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news