చిట్వేల్ మండలంలో సాగునీరు, తాగునీటి సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. నీటి కొరతతో రైతులు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అత్యవసర చర్యలు చేపట్టాలని కోరుతూ బుధవారం తహసీల్దార్ నరసింహారావుకు వినతిపత్రం అందజేశారు. సీపీఐ రాష్ట్ర పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా మండల నాయకులు తిప్పన ప్రసాద్, సామా గంగయ్య మాట్లాడుతూ సాగునీరు అందకపోవడంతో పంటల సాగుపై ప్రభావం పడుతోందని తెలిపారు. మరోవైపు మండలంలోని పలు గ్రామాల్లో తాగునీటి కొరత కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. నీటి సమస్యను కేవలం కార్యాలయ స్థాయిలో కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిస్థితిని గుర్తించాలని కోరారు.
తాగునీటి కొరత తీవ్రంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. చెరువులు, కాలువలు, ఇతర నీటి వనరుల నిర్వహణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజలకు అవసరమైన సమయంలో తాగునీరు అందేలా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా సాగునీటి లభ్యతపై రైతులకు స్పష్టమైన సమాచారం అందించాలని కోరారు. ప్రస్తుత నీటి సమస్యకు తాత్కాలిక పరిష్కారాలతో పాటు భవిష్యత్తులో కొరత ఏర్పడకుండా శాశ్వత చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో సీపీఐ గ్రామ కార్యదర్శి పి. దేవి నారాయణ పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news