అమరావతిలో టీడీపీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సన్నద్ధంగా ఉండాలని సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, ఈ వారంలోనే కోర్టు నిర్ణయం వెలువడవచ్చని తెలిపారు. తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే పార్టీపరంగా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్పష్టం చేశారు.
ప్రజల్లో సానుకూలత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయాలని చంద్రబాబు సూచించారు. అభ్యర్థుల గెలుపు బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనని తెలిపారు. అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యం ఇవ్వాలని, IVRS కాల్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను సేకరించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థుల విషయంలో కేవలం పార్టీ లెక్కలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు.
ఏ పార్టీకి ఎంత శాతం బలం ఉందనే లెక్కలు వేసుకోవడం కంటే ఎవరికి ఎక్కడ బలం ఉందో గుర్తించి అక్కడ పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. మిత్రపక్షాలతో సమన్వయం చేసుకుంటూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థులను నిర్ణయించాలని చెప్పారు. నియోజకవర్గాల స్థాయిలోనూ సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఎన్నికల ఏర్పాట్లలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే పల్లా శ్రీనివాస్, నిమ్మల రామానాయుడు దృష్టికి తీసుకురావాలని నేతలకు సూచించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకునే అవకాశం ఉన్నందున ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news