విజయవాడలోని అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన పాన్ ఐఐటీ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ సంస్థలు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనలను సీఎం పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన పరికరాలు, ఆరోగ్య సేవలకు ఉపయోగపడే వినూత్న ఆవిష్కరణలను పరిశీలిస్తూ వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు.
ఆక్సి ఏరోస్పేస్ సంస్థ రూపొందించిన డ్రోన్‌ను చంద్రబాబు ప్రత్యేకంగా పరిశీలించారు. డ్రోన్ సాంకేతికతను ఏయే రంగాల్లో వినియోగించవచ్చనే అంశాలపై సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, నిఘా, సేవల అందుబాటు వంటి వివిధ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా ఉపయోగించుకునే అవకాశాలపై వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ముఖాన్ని స్కాన్ చేసి ఆరోగ్యానికి సంబంధించిన నివేదికను అందించేలా రూపొందించిన ప్రత్యేక అనువర్తనాన్ని పరిశీలించారు. సంస్థ ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలను సందర్శించిన చంద్రబాబు, ముఖ స్కానింగ్ ద్వారా ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసే విధానం, అందించే వివరాలు, సాంకేతికత వినియోగం వంటి అంశాలను తెలుసుకున్నారు. ప్రజలకు ఆరోగ్య సేవలను సులభంగా అందించడంలో ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడే అవకాశాలపై ఆసక్తి చూపారు.
ఇదే కార్యక్రమంలో స్వర్ణాంధ్ర పది సూత్రాల అమలులో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ప్రభుత్వ లక్ష్యాలను మరింత సమర్థవంతంగా సాధించే అంశంపై చిన్నారులు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. సాంకేతికతను ఉపయోగించుకోవడం ద్వారా పాలనలో వేగం, పారదర్శకత, సేవల అందుబాటు మరింత మెరుగుపడే విధానాలను చిన్నారులు తమ ప్రదర్శన ద్వారా వివరించారు.
చిన్నారుల ప్రదర్శనను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తిగా వీక్షించారు. వారు వివరించిన అంశాలను అభినందించారు. సాంకేతిక పరిజ్ఞానంపై చిన్నారుల్లో ఉన్న అవగాహనను ప్రశంసించారు. అనంతరం చిన్నారులతో కలిసి చంద్రబాబు గ్రూప్ ఫొటో దిగారు. పాన్ ఐఐటీ సమ్మిట్ వేదికగా సాంకేతిక ఆవిష్కరణలు, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వాటి వినియోగంపై చర్చకు ప్రాధాన్యం లభించింది.
Fetching videos...
Fetching latest news...
No trending news