హార్మూజ్ జలసంధి పరిస్థితుల నేపథ్యంలో ఇంధన సరఫరాపై ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ బల్క్ అమ్మకాలపై తాత్కాలిక నిషేధం విధించింది. ఈ ఆంక్షలు 90 రోజులపాటు అమలులో ఉండనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇంధన నిల్వలు, సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పెరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
కొన్ని ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో ఇంధనం కొనుగోలు చేసి నిల్వ చేసుకునే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉన్నందున ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలందరికీ సమానంగా ఇంధనం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు, రిటైల్ అవుట్లెట్లకు సూచించింది. అవసరానికి మించి ఇంధనం నిల్వ చేయడం వల్ల సరఫరా వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఒక్కో వాహనానికి 200 లీటర్ల కంటే ఎక్కువ ఇంధనం నింపరాదని కేంద్ర ప్రభుత్వం రిటైల్ అవుట్లెట్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది. పెట్రోల్ బంకుల నిర్వాహకులు ఈ నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించింది. బల్క్ కొనుగోళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని, నిబంధనల ఉల్లంఘన జరిగితే తగిన చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొంది.
హార్మూజ్ జలసంధి ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలక మార్గంగా పరిగణించబడుతుంది. అక్కడి పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో ఇంధన కొరత ఏర్పడకుండా, సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగేందుకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో తలెత్తే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంధన పంపిణీలో ఎలాంటి ఆటంకాలు రాకుండా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news