నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. గ్రామీణ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం నిలుస్తోందని ఆమె స్పష్టం చేశారు.
పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ఆమె ప్రారంభించారు. అలాగే మూర్వకొండ శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం, నెహ్రూ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాల ధ్వజస్తంభాలు మరియు విగ్రహాల ప్రతిష్ట మహోత్సవాల్లో కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి పనులను పరిశీలించి స్థానికులతో మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని తెలిపారు. గతంలో చేపట్టిన సిమెంట్ రోడ్లు, చెక్ డ్యామ్‌లు, నీటి కుంటలు ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని ఆమె గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేసి నెహ్రూ నగర్‌ను పూర్తిస్థాయి అభివృద్ధి గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.
అలాగే రెండు ఆలయాల్లో ఒకే రోజు పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఆమె తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రభుత్వం ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తోందని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ కట్టుబడి శ్రీనివాస నాయుడు, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరావు, బీఎస్ఎన్ఎల్ సలహా కమిటీ సభ్యులు కురువ రమేష్, రఘురామిరెడ్డి, సుధాకర్ రెడ్డి, జయరామిరెడ్డి, మురళి, ధర్మక్షేత్ర అధికారులు, పీఆర్డీఈ, ఏఈ, తహసీల్దార్, గ్రామ టీడీపీ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మొత్తంగా చూస్తే నెహ్రూ నగర్లో జరిగిన ఈ అభివృద్ధి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామ ప్రజల్లో సంతోషాన్ని నింపాయి.
Fetching videos...
Fetching latest news...
No trending news