ప్రజల సంపూర్ణ భాగస్వామ్యంతోనే స్వచ్ఛత సాధ్యమై, స్వర్ణ ఆంధ్ర లక్ష్యాన్ని చేరుకోవచ్చని రాష్ట్ర ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. అవుకు గ్రామ పంచాయతీలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అవుకు ప్రధాన వీధుల్లో నిర్వహించిన స్వచ్ఛత అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.
అనంతరం పారిశుధ్య కార్మికులతో కలిసి మంత్రి స్వయంగా వీధులను శుభ్రం చేశారు. ప్రజలతో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఇళ్లు, వీధులు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలు ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, స్వచ్ఛతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా సామాజిక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.
“చెట్లు పెంచుదాం.. కాలుష్యాన్ని నివారిద్దాం.. పరిశుభ్రమైన వాతావరణాన్ని నిర్మిద్దాం” అనే సందేశంతో మంత్రి ప్రజలకు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, కాలుష్యాన్ని తగ్గించడం, గ్రామాల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించడం కోసం ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. స్వచ్ఛత విషయంలో ప్రతి కుటుంబం నుంచి చొరవ రావాలని స్పష్టం చేశారు.
అవుకులో ఆధునిక వ్యర్థాల నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ, బయోగ్యాస్, వేస్ట్ టు ఎనర్జీ, ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ వంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా గ్రామాల పరిశుభ్రతను మెరుగుపరచడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజారోగ్యాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు.
స్వచ్ఛమైన గ్రామాలు, పచ్చని పరిసరాలు, ఆరోగ్యకరమైన జీవన వాతావరణం కల్పించడమే స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి వివరించారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలకు ప్రజల సహకారం తోడైతే మరింత మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అన్నారు. గ్రామాల్లో చెత్త నిర్వహణ, పారిశుధ్యం, పచ్చదనం విషయంలో ప్రతి ఒక్కరూ నిరంతరం శ్రద్ధ వహించాలని సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించిన స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాల సాధనకు ప్రజలందరూ సహకరించాలని బీసీ జనార్దన్ రెడ్డి కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుధ్య సిబ్బంది, స్థానిక ప్రజలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అవుకు స్వచ్ఛత, పచ్చదనం, పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలిచేలా అందరూ కలిసి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
Fetching videos...
Fetching latest news...
No trending news