యువత స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు టంగుటూరి శీనయ్య, లాయర్ అల్లీ హుసేన్ పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడవచ్చని, ప్రతి ఆరోగ్యవంతుడు ఈ సేవా కార్యక్రమంలో భాగస్వామి కావాలని వారు సూచించారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని బనగానపల్లె ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రమాదాల్లో గాయపడిన వారికి సమయానికి రక్తం అందక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితుల్లో రక్తదానం ఒక ప్రాణదాయకమైన సేవగా మారిందని తెలిపారు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయడం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని చెప్పారు.
ఇప్పటి వరకు ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ఆధ్వర్యంలో సుమారు 15 రక్తదాన శిబిరాలు నిర్వహించి దాదాపు 800 మంది నుంచి రక్తాన్ని సేకరించి వివిధ బ్లడ్ బ్యాంకులకు అందించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమాలు సమాజంలో మంచి మార్పుకు దోహదపడుతున్నాయని ప్రశంసించారు.
ఫ్రెండ్స్ బ్లడ్ గ్రూప్ ప్రతినిధి షాషావలి మాట్లాడుతూ, యువకులు ఉత్సాహంగా రక్తదానంలో పాల్గొనడం ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలువురు యువకులు, సేవా భావులు పాల్గొని రక్తదానం చేశారు. సమాజ సేవా కార్యక్రమాలు కొనసాగించేందుకు భవిష్యత్తులో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news