అనంతపురం జిల్లా గుంతకల్లులో అర్ధరాత్రి ఎస్బీఐ ఏటీఎం మెషిన్‌ను ఎత్తుకెళ్లేందుకు దుండగులు చేసిన ప్రయత్నం విఫలమైంది. బొలెరో వాహనంలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఏటీఎం సెంటర్ అద్దాలు పగులగొట్టి మెషిన్‌ను లాక్కెళ్లేందుకు యత్నించారు. స్థానికుడు అప్రమత్తం కావడంతో నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఏటీఎంలో ఉన్న సుమారు రూ.30 లక్షల నగదు సురక్షితంగా నిలిచింది.
అనంతపురం జిల్లా గుంతకల్లులో దొంగలు అర్ధరాత్రి బీభత్సం సృష్టించారు. నిత్యం రద్దీగా ఉండే ట్రావెల్స్ బంగ్లా సర్కిల్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను లక్ష్యంగా చేసుకుని దొంగలు భారీ చోరీకి ప్రయత్నించారు. అయితే స్థానికుల అప్రమత్తతతో వారి ప్లాన్ చివరి నిమిషంలో బెడిసికొట్టింది.
పోలీసుల వివరాల ప్రకారం, బ్లాక్ కలర్ బొలెరో టెంపో వాహనంలో వచ్చిన ముగ్గురు దుండగులు అర్ధరాత్రి సుమారు 2:30 గంటల సమయంలో ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించారు. ముందుగా ఏటీఎం సెంటర్ అద్దాలను ధ్వంసం చేసి, అనంతరం ఏటీఎం మెషిన్‌కు బలమైన తాడు కట్టి వాహనంతో లాగి బయటకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో పెద్ద శబ్దాలు రావడంతో ఎదురుగా నివసిస్తున్న ఓ వ్యక్తి మేల్కొన్నాడు. బయటకు వచ్చి చూడగా దుండగులు ఏటీఎం మెషిన్‌ను లాక్కెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. వెంటనే ఆయన గట్టిగా అరుస్తూ చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశారు. దీంతో భయపడిన దుండగులు ఏటీఎం మెషిన్‌ను అక్కడే వదిలేసి బొలెరో వాహనంలో పరారయ్యారు.
ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ముగ్గురు వ్యక్తులు కలిసి ఈ చోరీ యత్నానికి పాల్పడినట్లు ఫుటేజీలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎం మెషిన్లో సుమారు రూ.30 లక్షల నగదు ఉన్నట్లు బ్యాంకు అధికారులు వెల్లడించారు. దొంగలు మెషిన్‌ను తీసుకెళ్లడంలో విఫలమవడంతో బ్యాంకు సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
ఈ ఘటనతో రెండు నెలల క్రితం ధర్మవరంలో జరిగిన ఇదే తరహా చోరీ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. అప్పట్లో కూడా దుండగులు బొలెరో వాహనంతో ఎస్బీఐ ఏటీఎంను లాక్కెళ్లి, అనంతరం రాప్తాడు సమీపంలో మెషిన్‌ను పగులగొట్టి నగదుతో పరారయ్యారు.
దీంతో గుంతకల్లు ఘటన వెనుక కూడా అదే ముఠా ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీలు, ఇతర సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news