అమరావతిలోని ఈగల్ ప్రధాన కార్యాలయంలో మాదకద్రవ్యాల నియంత్రణపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష నిర్వహించారు. 2026-2029 మాదకద్రవ్యాల నియంత్రణ విజన్ డాక్యుమెంట్ అమలు, గంజాయి నిర్మూలనలో ఇప్పటివరకు సాధించిన పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో చర్చించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఈగల్ బృందాలతో జూమ్ ద్వారా అనిత సమీక్ష చేపట్టారు.
గంజాయి నిర్మూలనకు సంబంధించి ఇప్పటివరకు చేపట్టిన చర్యలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్‌లో అమలు చేయాల్సిన వ్యూహాలను ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ హోంమంత్రి అనితకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ఈగల్ బృందాలు చేపడుతున్న చర్యలను సమీక్షించారు. జిల్లాల వారీగా నిఘా, కేసుల నమోదు, హాట్స్పాట్ల గుర్తింపు వంటి అంశాలపై చర్చించారు.
భావితరాల బంగారు భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఈగల్ బృందాన్ని ఏర్పాటు చేశారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా అడ్డుకోవడం, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను నియంత్రించడం కోసం సమర్థవంతమైన నిఘా వ్యవస్థ అవసరమని ఆమె అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా కీలకమని వివరించారు.
గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించిన సమాచారం అందించేందుకు ‘బ్రేక్ ద సైలెన్స్’ పేరుతో 1972 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి తెలిపారు. గంజాయి అక్రమ కార్యకలాపాలపై ప్రజలు సమాచారం అందించి అధికారులకు సహకరించాలని కోరారు. అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని అక్రమ కార్యకలాపాలపై నిఘా పెంచేలా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా 900 గంజాయి హాట్స్పాట్లను గుర్తించి జియో ట్యాగింగ్ ఆధారిత నిఘా కొనసాగిస్తున్నట్లు అనిత తెలిపారు. గత నాలుగు నెలల్లోనే 20 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై నిఘాను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని అధికారులకు సూచించారు. హాట్స్పాట్ల వద్ద నిరంతర పర్యవేక్షణతో పాటు అనుమానాస్పద కార్యకలాపాలపై వేగంగా స్పందించాలని కోరారు.
ఈగల్ బృందం పటిష్ట నిఘాతోనే రాష్ట్రంలో నేరాల రేటు 14 శాతం తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణతో పాటు నేరాల నివారణలోనూ సమర్థవంతమైన నిఘా వ్యవస్థ కీలకంగా మారిందని తెలిపారు. 2026-2029 విజన్ డాక్యుమెంట్‌ను సమర్థంగా అమలు చేస్తూ మాదకద్రవ్యాల నియంత్రణకు మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జిల్లాల వారీగా ఈగల్ బృందాల పనితీరును నిరంతరం సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందించాలని హోంమంత్రి ఆదేశించారు. గంజాయి అక్రమ కార్యకలాపాలపై ప్రజల నుంచి వచ్చే సమాచారాన్ని వేగంగా పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, పోలీసులు, ఈగల్ బృందాలు సమన్వయంతో పనిచేస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆమె పేర్కొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news