నంద్యాలలోని శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో యువత భవిష్యత్తుకు భరోసా కార్యక్రమాన్ని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు. భవిష్యత్ భారతాన్ని నిర్మించడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోనైనా, దేశంలోనైనా శాశ్వతమైన మార్పు తీసుకురావడంలో యువశక్తి ప్రధాన ఆధారమని అన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, సరైన మార్గదర్శకత్వం అందించాల్సిన అవసరం ఉందని వివరించారు.
ఒకప్పుడు రాయలసీమ అంటే తీవ్ర వర్షాభావ పరిస్థితులు, రైతుల ఇబ్బందులు, ఉపాధి కోసం వలసలు అనే పరిస్థితులు గుర్తుకు వచ్చేవని బైరెడ్డి శబరి అన్నారు. ప్రస్తుతం ప్రాంతంలో పరిశ్రమలు, పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి అవకాశాలు విస్తరిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడం ద్వారా స్థానికంగా యువతకు ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఏర్పడుతోందని తెలిపారు. యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలా అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పెట్టుబడుల కోసం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతున్నారని బైరెడ్డి శబరి పేర్కొన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు రావడం ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందన్నారు. విద్యార్థులు కేవలం ఉద్యోగం పొందడమే లక్ష్యంగా కాకుండా, భవిష్యత్తులో ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
సదస్సు అనంతరం ఎంపీ విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించారు. ఉన్నత విద్య, పోటీ పరీక్షలు, నూతన వ్యాపార ఆలోచనలు, స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. స్థానిక యువ పారిశ్రామికవేత్త, ‘మీతో’ యాప్ వ్యవస్థాపకుడు న్యాస పవన్ను ఆమె అభినందించారు. యువతలోని ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చేందుకు ప్రయత్నించాలని సూచించారు.
శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ ప్రొఫెసర్ జి. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ యువత ఆలోచనలే దేశ నిర్మాణానికి బలమైన పునాదులని అన్నారు. విద్యార్థుల్లో ప్రతిభ, సరికొత్త ఆలోచనలు ఉన్నాయని, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం లభిస్తే మంచి ఫలితాలు సాధించగలరని పేర్కొన్నారు. విద్యా రంగంలో అందుబాటులోకి వచ్చిన మౌలిక వసతులు, సాంకేతిక అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
కళాశాల డైరెక్టర్ డాక్టర్ జి. హేమంత్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలాల్లో యువశక్తి ఒకటని అన్నారు. విద్యార్థులు పుస్తక పరిజ్ఞానానికే పరిమితం కాకుండా సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. నిరంతరం నేర్చుకునే అలవాటును పెంచుకుంటే మారుతున్న ప్రపంచంలో కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలరని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల డీన్ ఎ.ఎస్. ప్రగతి, సెంట్రల్ ఫుడ్ కార్పొరేషన్ డైరెక్టర్ నరహరి విశ్వనాధ్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news