శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో కొత్త ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయానికి సమీపంలో ప్రస్తుతం నోవోటెల్ హోటల్ మాత్రమే ప్రధానంగా అందుబాటులో ఉండగా, భవిష్యత్తులో పెరగనున్న ప్రయాణికులు, విదేశీ అతిథులు, పర్యాటకులు, పారిశ్రామిక ప్రతినిధుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరిన్ని విలాసవంతమైన హోటళ్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో తుక్కుగూడ హార్డ్‌వేర్ పార్క్-3లో హోటళ్ల నిర్మాణానికి భూములను కేటాయించింది.
ప్రస్తుతం ఒబెరాయ్ గ్రూపు సంస్థలు, వెంకటేశ్వర హోటల్స్ యాజమాన్యం హోటళ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టాయి. ఒబెరాయ్ గ్రూపు సంస్థ 3.63 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ.532 కోట్ల పెట్టుబడితో ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అదే విధంగా వెంకటేశ్వర హోటల్స్ సంస్థ ఒక ఎకరం స్థలంలో సుమారు రూ.102 కోట్ల పెట్టుబడితో హోటల్ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు సమాచారం. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో హోటల్ వసతి మరింత విస్తరించే అవకాశం ఉంది.
విమానాశ్రయం పరిసరాల్లో ప్రస్తుతం ఉన్న ప్రముఖ హోటల్ వీఐపీలు, విదేశీ అతిథులతో తరచూ సందడిగా ఉంటోంది. విమానాశ్రయానికి వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు, వ్యాపారవేత్తలు, ప్రభుత్వ ప్రతినిధులు, పర్యాటకులకు నాణ్యమైన వసతి అవసరం పెరుగుతున్న నేపథ్యంలో కొత్త హోటళ్ల ఏర్పాటుకు ప్రాధాన్యం ఏర్పడింది. విమానాశ్రయం చుట్టుపక్కల పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలు విస్తరిస్తుండటం కూడా హోటల్ రంగంలో పెట్టుబడులకు కారణంగా కనిపిస్తోంది.
శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు వేగంగా ఏర్పాటవుతున్నాయి. భవిష్యత్ నగరానికి సంబంధించిన కార్యాలయం నుంచి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత పారిశ్రామిక పెట్టుబడులపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. విదేశీ సంస్థలు కూడా ఈ ప్రాంతంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వస్తున్న నేపథ్యంలో వ్యాపార ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
విమానాశ్రయానికి సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల పరిధిలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు రూపకల్పన వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఇటువంటి అభివృద్ధి ప్రాజెక్టులు, కొత్త పరిశ్రమలు, సాంకేతిక సంస్థలు, పర్యాటక కేంద్రాలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతానికి దేశీయ, అంతర్జాతీయ సందర్శకుల రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఫైవ్‌స్టార్ హోటళ్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
తుక్కుగూడ హార్డ్‌వేర్ పార్క్-3లో పరిశ్రమలు, హోటళ్ల ఏర్పాటుకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ అధికారులు గడువును కూడా నిర్దేశించారు. నిర్మాణం ప్రారంభించిన తేదీ నుంచి 18 నెలల్లోపు కార్యకలాపాలు ప్రారంభించేలా లక్ష్యం పెట్టినట్లు సమాచారం. దీంతో భూములు పొందిన సంస్థలు తమ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే హార్డ్‌వేర్ పార్క్-3లో పలు సంస్థలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించింది.
ఈ ప్రాంతంలో ఇప్పటికే అంతరిక్ష, విమానయాన రంగానికి సంబంధించిన పారిశ్రామిక కార్యకలాపాలు, రక్షణ రంగానికి విడిభాగాలు సరఫరా చేసే సంస్థలు ఏర్పాటయ్యాయి. ప్రముఖ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ కూడా కొత్త కార్యకలాపాలను ప్రారంభించింది. మహేశ్వరం, తుక్కుగూడ ప్రాంతాల్లో పరిశ్రమల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, దీనికి తోడు కొత్త ఫైవ్‌స్టార్ హోటళ్ల నిర్మాణం మొదలవుతుండటంతో శంషాబాద్ పరిసర ప్రాంతాల ఆర్థిక, వాణిజ్య ముఖచిత్రం మరింత మారే అవకాశం కనిపిస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news