నంద్యాలలో శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. స్థానిక ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఆవరణలో బలిజ సంఘం, కాపు రాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని రాష్ట్ర న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల ప్రజా సంక్షేమ పాలన, సాగునీటి అభివృద్ధి, చారిత్రక సేవలను మంత్రి కొనియాడారు.
ప్రజా సంక్షేమ పాలనలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయుడని మంత్రి ఎన్ఎండీ ఫరూక్ అన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి అనేక సంస్కరణలు చేపట్టిన గొప్ప పాలకుడిగా ఆయన చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించేందుకు చెరువులు, కుంటలను నిర్మించి నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమమే పాలనకు కేంద్రబిందువుగా ఉండాలనే సందేశాన్ని ఆయన పాలన అందిస్తుందని తెలిపారు.
శ్రీకృష్ణదేవరాయలు ఏ ఒక్క సామాజిక వర్గానికో పరిమితమైన వ్యక్తి కాదని, అందరికీ ఆదర్శప్రాయుడని మంత్రి స్పష్టం చేశారు. ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో ఎలాంటి వివాదాలకు తావులేదని పేర్కొన్నారు. తిరుమల శ్రీవారికి శ్రీకృష్ణదేవరాయలు ఎన్నో అమూల్యమైన వజ్రాభరణాలు, బంగారు నగలను సమర్పించారని తెలిపారు. ఆయన కాలంలో నిర్మించిన అనేక చారిత్రక కట్టడాలు నేటికీ అప్పటి వైభవానికి ప్రతీకలుగా నిలిచాయని చెప్పారు.
మార్కాపురం సమీపంలోని కంభంలో తన భార్య పేరుతో శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన చెరువు గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. ఆ చెరువు నేటికీ దేశంలోని అతిపెద్ద చెరువుల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని తెలిపారు. ప్రజల సాగునీటి అవసరాలను తీర్చేందుకు అప్పటి పాలకులు చేపట్టిన చర్యలు ఇప్పటికీ స్ఫూర్తినిస్తున్నాయని అన్నారు. నీటి వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చిన పాలనకు శ్రీకృష్ణదేవరాయలు చిహ్నంగా నిలిచారని పేర్కొన్నారు.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటు మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ప్రత్యేక చొరవతో సాకారమైందని బలిజ సంఘం పెద్దలు, నాయకులు కొనియాడారు. విగ్రహ ఏర్పాటుకు సహకరించిన మంత్రి చొరవను అభినందించారు. గతంలో బలిజ సామాజిక వర్గానికి చెందిన పాణ్యం రామయ్యకు మున్సిపల్ చైర్మన్గా అవకాశం కల్పించడంతో పాటు శాంతిరాముడు వంటి ప్రముఖులకు అండగా నిలిచారని వారు గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ ఫరూక్ కుటుంబానికి తమ పూర్తి మద్దతు ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.
అనంతరం దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు విగ్రహానికి మంత్రి ఫరూక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన కామిని మల్లికార్జున, చెన్నంశెట్టి శ్రీనివాసులు, కొప్పుల మురళి, చింతల కుమార్, ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ చలం బాబు, విశ్రాంత బ్యాంకు ఉద్యోగి నాగేశ్వరరావు, లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షుడు నాగరాజు, సుబ్బయ్య, గోపాల్, పాణ్యం శ్రీకాంత్ తదితరులను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండీ ఫయాజ్, శాంతిరాం విద్యాసంస్థల అధినేత శాంతిరాముడు, నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ గుంటుపల్లి హరిబాబు, పారిశ్రామికవేత్త రాజారాం, వైద్యులు రవికృష్ణ, నారాయణ, ఆర్పీఎఫ్ అధ్యక్షుడు రెడ్డి శేఖర్, ఏపీపీఎస్సీ డైరెక్టర్ శివరాం, అహోబిలం బలిజ అన్నదాన సత్రం అధ్యక్షుడు విజయ్, బలిజ సంఘం మాజీ అధ్యక్షుడు పడకండ్ల సుబ్రహ్మణ్యం, చింతల రామకృష్ణ, అభిమన్యుడు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీకృష్ణదేవరాయల విగ్రహావిష్కరణతో నంద్యాల ఎన్టీఆర్ కాంప్లెక్స్ ఆవరణలో చారిత్రక వారసత్వాన్ని గుర్తుచేసే మరో ప్రతీక ఏర్పడిందని నిర్వాహకులు తెలిపారు. ప్రజా సంక్షేమం, నీటి వనరుల అభివృద్ధి, సమర్థ పాలన వంటి అంశాల్లో శ్రీకృష్ణదేవరాయల ఆలోచనలు నేటి తరానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ఆయన ఆదర్శాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news