విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమామహేశ్వరరావు చేపట్టిన అభివృద్ధి, ప్రజా సేవపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ మహిళా నేతలు స్పష్టం చేశారు. విజయవాడ సింగ్‌నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి దాసరి ఉదయశ్రీ, సెంట్రల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు పైడి తులసి, మాజీ కార్పొరేటర్ పిరియ జగదాంబ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎస్కే గౌసియా, నియోజకవర్గ మహిళా కార్యదర్శి దొండపాటి సుల్తానా విలేకరుల సమావేశం నిర్వహించారు.
మాజీ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళా నాయకులు ఖండించారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు విశ్వసనీయత లేని నాయకుల మాటలపై నమ్మకం లేదని దాసరి ఉదయశ్రీ, పైడి తులసి అన్నారు. ప్రజల కోసం పనిచేసే నాయకుడు ఎవరో, కేవలం మాటలు చెప్పే నాయకుడు ఎవరో నియోజకవర్గ ప్రజలకు స్పష్టంగా తెలుసని పేర్కొన్నారు.
మాజీ డిప్యూటీ మేయర్ శైలజారెడ్డిని ఉద్దేశించి దాసరి ఉదయశ్రీ కీలక ప్రశ్నలు సంధించారు. 2024 ఎన్నికల సమయంలో ప్రజల్లో తిరిగి సేవ చేశామని, సెంట్రల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెబుతున్న మల్లాది విష్ణుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి ఎందుకు టికెట్ ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంచి సేవ చేశారని చెబుతున్నప్పుడు సొంత పార్టీ ఆయనకు టికెట్ ఎందుకు నిరాకరించిందో ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.
నందమూరి నగర్ ప్రజల చిరకాల సమస్యగా ఉన్న ఇళ్ల పట్టాల అంశాన్ని కూడా మహిళా నాయకులు ప్రస్తావించారు. ఇళ్ల పట్టాలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చి ఓట్లు అడిగారని, ఐదేళ్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మల్లాది విష్ణు నాయకత్వంలో శైలజారెడ్డి డిప్యూటీ మేయర్‌గా ఉన్నప్పటికీ ఆ సమస్యను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. బోండా ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆరు నెలల్లోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుని అర్హులకు పట్టాలు అందించే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు.
సెంట్రల్ నియోజకవర్గంలో సుమారు రూ.650 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మహిళా నాయకులు వివరించారు. మధురానగర్ రహదారి దిగువ వంతెన, వాంబే కాలనీలో వడపోత నీటి కేంద్రం, గద్దె వెంకట్రామయ్య నగర్లో నీటి ట్యాంకు వంటి పనులను ప్రస్తావించారు. రూ.100 కోట్ల అంచనా వ్యయంతో 316వ రహదారి దిగువ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ అనుమతులు తీసుకురావడానికి కృషి చేశామని తెలిపారు.
సింగ్‌నగర్ ప్రాంతంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు చర్యలు చేపట్టినట్లు నేతలు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విద్య, రహదారులు, మురుగునీటి పారుదల, తాగునీరు, ఇతర మౌలిక వసతులపై బోండా ఉమా ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు.
పేదలకు స్వయం ఉపాధి కల్పించే కార్యక్రమాలకు కూడా సహాయం అందిస్తున్నామని పైడి తులసి తెలిపారు. తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లు, అల్పాహార బండ్లు, చిన్న దుకాణాలు, ఆటోలు వంటి ఉపాధి మార్గాలకు సహకారం అందిస్తున్నామని చెప్పారు. గతంలో తమ నాయకత్వంలో ఇలాంటి సహాయం ఎందుకు అందలేదనే విషయాన్ని ప్రతిపక్ష నాయకులు ముందుగా ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు.
బోండా ఉమామహేశ్వరరావు ప్రజల అవసరాలను గుర్తించి తన వంతు సహాయం అందించే నాయకుడని పైడి తులసి అన్నారు. ఆయన కుమారులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ కూడా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పేదలకు సహాయం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో కార్యాలయానికి వచ్చే వారికి తమ వంతు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
ఐదేళ్ల పరిపాలనలో పేదలకు కనీసం రూ.2 వేలతో ఒక ఇస్త్రీ పెట్టె అయినా ఇచ్చారా అని శైలజారెడ్డిని పైడి తులసి ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేశామని చెప్పుకునే ముందు గత పాలనలో చేసిన పనులపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. బోండా ఉమా అభివృద్ధి, ప్రజా సేవపై ఆధారాలతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
తమ వేదికైనా, ప్రతిపక్ష వేదికైనా లేదా ఉమ్మడి వేదికైనా అభివృద్ధి అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధమని దాసరి ఉదయశ్రీ, పైడి తులసి సవాల్ చేశారు. మల్లాది విష్ణు, శైలజారెడ్డి లేదా వారి పార్టీకి చెందిన ఎవరైనా ప్రజల సమక్షంలో చర్చకు రావాలని కోరారు. మాటలతో కాకుండా ఆధారాలతో అభివృద్ధి పనులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Fetching videos...
Fetching latest news...
No trending news