తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్ల అలైన్మెంట్ మార్పుల వ్యవహారంలో వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. తిరుపతి మాస్టర్ ప్లాన్‌లో భాగంగా ప్రతిపాదించిన రోడ్ల అలైన్మెంట్ మార్పుల కోసం సుమారు రూ.2 కోట్లు వసూలు చేసినట్లు విజిలెన్స్ విచారణలో తేలినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి డిప్యూటీ మేయర్ అభినయ్‌రెడ్డి పదవిని అడ్డుపెట్టుకుని అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
2022 జూలైలో ఆరు మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు వచ్చిన అనంతరం కొంతమంది నిర్మాణదారులు, అపార్ట్మెంట్ యజమానులు భూమనను ఆశ్రయించినట్లు విజిలెన్స్ గుర్తించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వజ్ర అపార్ట్మెంట్, వింటేజ్ హైట్స్ యజమానుల నుంచి భారీ మొత్తంలో నగదు డిమాండ్ చేసినట్లు నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. అనంతరం రోడ్ల అలైన్మెంట్లో మార్పులు చేసి రెండో నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మొదట 80 అడుగుల వెడల్పుతో ప్రతిపాదించిన రహదారులను 70 నుంచి 75 అడుగులకు, కొన్ని ప్రాంతాల్లో 50 అడుగుల వరకు తగ్గించినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల కొందరికి ప్రయోజనం చేకూరేలా వ్యవహరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశంపై కూడా అధికారులు దృష్టి సారించారు.
విజిలెన్స్ సిఫారసుల ఆధారంగా భూమన కరుణాకర్‌రెడ్డి, అభినయ్‌రెడ్డిపై తదుపరి చర్యలకు మున్సిపల్ అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నివేదికలో పేర్కొన్న అంశాలపై చట్టపరమైన చర్యలు, శాఖాపరమైన విచారణలు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వ్యవహారం తిరుపతి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారగా, రానున్న రోజుల్లో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news