తిరుపతి జిల్లాలో ఏనుగుల బీభత్సం విషాదాన్ని నింపింది. పాకాల మండలం దేవినేని ఇండ్లు గ్రామంలో ఏనుగుల దాడిలో రైతు తిమ్మారెడ్డి ప్రాణాలు కోల్పోయారు. పొలాల వద్ద ఉన్న సమయంలో ఏనుగులు దాడి చేయడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రైతు కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
అటవీ ప్రాంతాలకు సమీపంలో ఉన్న గ్రామాల్లో ఏనుగుల సంచారం తరచూ ఆందోళన కలిగిస్తుండగా, ఈ ఘటన మరోసారి మానవ–వన్యప్రాణుల ఘర్షణ సమస్యను వెలుగులోకి తెచ్చింది. రైతులు, గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. ఘటన సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రైతు తిమ్మారెడ్డి మృతిపట్ల సంతాపం తెలుపుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు.
అలాగే ఏనుగుల సంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. గ్రామాల్లో అప్రమత్తత చర్యలు పెంచడంతో పాటు ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. ఈ ఘటనతో దేవినేని ఇండ్లు గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా, రైతు కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news